Share News

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తరిమేస్తారు

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:24 PM

అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీని ప్రజలే తరిమేస్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తరిమేస్తారు
సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీని ప్రజలే తరిమేస్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. కర్నూలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంగా గత ఐదేళ్లలో వనరులను దోచుకున్న వైఎస్‌ జగన్‌ను ప్రజలు తిరస్కరించినా సిగ్గు లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదలకు అందించే బియ్యాన్ని దోచుకుతిన్న మీరు.. విద్యుత్‌ చార్జీలు పెంచారంటూ రోడ్ల మీదకు వచ్చి దౌర్జన్యాలు, దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే విద్యుత్‌ చార్జీలను పెంచారని, అయితే ప్రస్తుతం నిరసనలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీకి ఆందోళనలు చేసే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. కడప జిల్లాలో అధికారిపై దాడికి పాల్పడం సిగ్గుచేటన్నారు. అఽధికారులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. జగన్‌ ఆదేశాలతో అధికారులను బెదిరించడం, దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రాబట్టడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే వారే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:24 PM