Share News

భారీ వర్షం

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:32 PM

భారీ వర్షం

భారీ వర్షం

పలుచోట్ల దెబ్బతిన్న రహదారులు, ధ్వంసమైన వంతెనలు

పొంగిపొర్లిన వాగులు, వంకలు

కర్నూలు రూరల్‌/కల్లూరు, జూన్‌ 3: నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. మే నెలలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. నైరుతి రుతు పవనాలు కేరళను తాకడంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మరికొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షానికి కర్నూలు రూరల్‌ పరిధిలోని కర్నూలు-ఉల్చాల ప్రధాన రహదారి వంతెన కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలికంగా పనులను చేపట్టి పునరుద్ధరించారు. దీంతో సి. బెళగల్‌ మండలం గుండ్రేవుల, సంగాల, కొత్తకోట, కర్నూలు రూరల్‌ మండలం రేమట, ఉల్చాల వంటి సమీప ప్రాంతాల నుంచి రాకపోకలు స్తంభించాయి. ధ్వంసమైన వంతెనను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌దేశాయ్‌ తదితరులు పరిశీలించారు. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌ సెంటర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షం ఆదివారం రాత్రి కురిసిన వాన గాలి భీభత్సానికి నేలకూలింది. ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌ పైభాగాన ఉన్న ఇళ్ల మీదకు ఒరిగిపోయి, ప్రధాన రహదారిపై అడ్డంగా పడిపోయింది. కల్లూరు మండలంలో వక్కెర వాగుకు వరద పోటెత్తింది. కల్లూరు మండలం నెరవాడ సమీపంలో వక్కెరవాగు ఉధృతంగా ప్రవహించింది.

జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఇలా...

ఎమ్మిగనూరులో 69.2 మిల్లీమీటర్లు కర్నూలు అర్బన్‌లో 67.4, కల్లూరులో 65.6, హాలహర్విలో 64.6, కర్నూలు రూరల్‌లో 51.2, ఆలూరులో 47.4, గూడూరులో 45.6, తుగ్గలిలో 44.6, ఓర్వకల్లులో 43.2 మి.మీ., వర్షం కురిసింది. కోడుమూరులో 43.2, చిప్పగిరిలో 39.8, గోనెగండ్లలో 34.2, మంత్రాలయంలో 30.8, మద్దికెరలో 27.8, వెల్దుర్తిలో 23.4, నందవరంలో 21.8, దేవనకొండలో 20.6, ఆస్పరిలో 20ఎంఎం, హోళగుందలో 16.4, కౌతాళంలో 16.2, పత్తికొండలో 15.4, ఆదోనిలో 14.2, కృష్ణగిరిలో 13.8, సి.బెళగల్‌లో 12.6, పెద్దకడబూరులో 10.4మి.మీ., వర్షం కురిసింది.

Updated Date - Jun 03 , 2024 | 11:32 PM