Share News

ఆయన ఆనాటి ఎమ్మెల్యే ఆత్మ

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:08 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టరు పేరు చెబితే అధికారులకు హడల్‌. నాటి ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డిని సాయి అని పేరు పెట్టి పిలవగలిగేంతటి సాన్నిత్యం ఆయనకు ఉంది.

ఆయన ఆనాటి ఎమ్మెల్యే ఆత్మ
ఆదోని మున్సిపాలిటీ అధికారులు 14వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి కాంట్రాక్టరు ద్వారా ఒప్పందం చేసుకున్న నిజామోద్దీన్‌కాలనీ ప్రధాన రోడ్డు ఇది. ఈ వీధిలోనే సీసీ డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది.

బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీడీఎంఏ ఆదేశాలు

ఉత్తర్వులు బేఖాతర్‌.. ఆ కాంట్రాక్టరుకే మళ్లీ పనులు

కర్నూలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టరు పేరు చెబితే అధికారులకు హడల్‌. నాటి ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డిని సాయి అని పేరు పెట్టి పిలవగలిగేంతటి సాన్నిత్యం ఆయనకు ఉంది. ఆ చనువుతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఇంజనీర్లతో సంబంధం లేదు.. ఒప్పందాలను పట్టించుకోవాల్సిన పని లేదు. తాను ఏ పని చేస్తే అదే ఒప్పందంగా రికార్డు చేయాల్సిందే. లేదంటే నాటి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నుంచి ఫోన్లు వచ్చేవి. నిరుపేదలు నివసించే నిజామోద్దీన్‌ కాలనీలో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు నిధులు మంజూరు చేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. ఆ పని చేస్తే లాభం రాదనో.. మరే ఇతర కారణమో.. ఆ కాంట్రాక్టరుకే ఎరుక. సీసీ డ్రైనేజీ నిర్మాణం చేయకపోగా ఎలాంటి అనుమతులు లేకుండా మరో ప్రాంతంలో బీటీ రోడ్డు వేశారు. దీనిపై ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ.. కాంట్రాక్టరున ‘బ్లాక్‌ లిస్ట్‌’లో పెట్టేందుకు సమగ్ర నివేదిక పంపాలని మున్సిపాలిటీ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్‌డీ)ని ఆదేశించారు. రాజకీయ అండతో అదే కాంట్రాక్టరుకు రూ.కోట్ల విలువైన పనులు ఇవ్వడం విమర్శలకు తావిస్తున్నది.

ఆదోని మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.కోట్ల విలువైన సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు నిర్మించడం వంటి పనులు చేపట్టారు. ఈ పనులు మెజార్టీగా నాటి వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆత్మగా పిలవబడే ఆయన అత్యంత సన్నిహితుడైన ఓ కాంట్రాక్టరు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా నిజామొద్దీన్‌ కాలనీ వార్డు నంబరు ఇంటి నుంచి 5/633/1 నుంచి ఇంటి నంబరు 5/660 వరకు సీసీ డ్రైనేజీ నిర్మాణానికి రూ.18.79 లక్షలతో మున్సిపల్‌ ఇంజనీర్లు టెండర్లు పిలిచారు. ఆ పనుల్ని నాటి వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అత్యంత సన్నిహిత కాంట్రాక్టరు దక్కించుకున్నారు. 2022 మార్చి 21న మున్సిపల్‌ ఇంజనీర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే.. నిబంధనలను తుంగలో తొక్కి సీసీ డ్రైనేజీ నిర్మాణం చేయకుండా అదే కాలనీలో మరో వీధిలో బీటీ రోడ్డు (తారు రోడ్డు) నిర్మించారని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. టెండరు ఒప్పందం నిబంధనలు ప్రకారం పనులు చేయించాల్సిన ఇంజనీర్లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణులు వెల్లువెత్తుతున్నాయి.

ఎమ్మెల్యే అండదండలతో కౌన్సిల్‌ ఆమోదం, మున్సిపల్‌ శాఖ సీడీఎంఏ అప్రూవల్‌ లేకుండానే నిబంధలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ సీసీ డ్రైనేజీ బదులుగా మరోప్రాంతంలో బీటీ రోడ్డు వేయడమే కాకుండా.. బిల్లులు చెల్లించలేదంటూ మున్సిపాలిటీపై హైకోర్టుకు వెళ్లారని అధికారులే పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో విచారిస్తే.. టెండరు ఒప్పందం నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పనులు చేశారని అధికారులు గుర్తించారు. దీంతో ఒప్పందం ప్రకారం నిజామొద్దీన్‌ కాలనీలో సీసీ డ్రైనేజీ నిర్మించలేదని వాస్తవ వివరాలతో మున్సిపల్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా నిబంధనలు ప్రకారం పనులు చేయించడంతో మున్సిపల్‌ ఇంజనీర్లు విఫలమైనందున ఏపీసీఎస్‌ ప్రకారం క్రమశిక్షణ చర్యలకు గురి అవుతారని, సీసీఏ రూల్స్‌ 1991 ప్రకారం సంబంధిత ఈఈ, డీఈఈ, ఏఈలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ అఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ), పబ్లిక్‌ హెల్త్‌ విభాగం ఈఎన్‌సీని ప్రభుత్వం ఆదేశించింది. అదే క్రమం ఒప్పంద నిబంధనలు ఉల్లఘించిన కాంట్రాక్టరును బ్లాక్‌ లిస్టులో చేర్చాలని, అందుకు తీసుకున్న చర్యల నివేదికను తక్షణమే అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంబంధిత ఇంజనీర్లకు చార్జ్‌ మెమోలు జారీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టరును బ్లాక్‌ లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎల్‌ఆర్‌ ఆర్‌ఓసీ నంబరు ఈ-2138965/2023/సీ1 కింద 2023 నవంబరు9న మున్సిపల్‌ శాఖ అనంతపురం రీజినల్‌ డైరెక్టరుకు సీడీఎంఏ ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇందుకు విరుద్ధంగా సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకపోగా అప్పటి వైసీపీ సాయిప్రసాద్‌రెడ్డి పలుకుపబడితో రూ.కోట్ల విలువైన పనులు ఆ కాంట్రాక్టర్‌కే అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

బీటీ రోడ్డు నిర్మాణం తరువాత కౌన్సిల్‌ ఆమోదం

ఒకసారి టెండరు పిలిచిన ఏ పనినైనా మార్పు చేయాలనుకుంటే ప్రతిపాదనలు సవరిం చాలి. కౌన్సిల్‌ ఆమోదం, సీడీఎంఏ అప్రూవల్‌ తీసుకున్న తరువాత మళ్లీ టెండర్లు పిలిచి కాంట్రాక్టరు అప్పగించాలి. ఇందుకు విరుద్ధంగా కౌన్సిల్‌ ఆమోదం, సీడీఎంఏ అప్రూవల్‌ లేకుండా కాంట్రాక్టరే ఇష్టారాజ్యంగా సీసీ డ్రైనేజీ బదులుగా బీటీ రోడ్డు వేయడం విమర్శలకు తావిస్తుంది. కాంట్రాక్టరు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని సీడీఎంఏ 2023 నవంబరు 9న ఆదేశాలు జారీ చేస్తే.. సదరు కాంట్రాక్టరు, ఇంజనీర్లను రక్షించేందుకు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి రంగంలో దిగారు. సీసీ డ్రైన్లు వేయాల్సిన వీధుల్లో లెక్కకు మంచి అక్రమణలు ఉండడడంతో డ్రైనేజీ నిర్మాణాలకు అనుకూలంగా లేనందున ఎమ్మెల్యే కొన్ని మార్పులతో ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారని, డ్రైన్ల స్థానంలో బీటీ రోడ్డు వేయుటకు చైర్‌ పర్సన్‌ ముందస్తు అనుమతి మంజూరు చేశారు. చైర్‌ పర్సన్‌ తీసుకున్న అత్యవసర చర్యకు ఆమోదం కోసం కౌన్సిల్‌ అజెండాలో పెట్టారు. కౌన్సిల్‌ తీర్మానం నంబరు 497 కింద 2024 మార్చి 7న దీన్ని ఆమోదించారు. అంటే.. 2022 మార్చి 21న సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఒప్పందం చేసుకొని.. ఆ స్థానంలో బీటీ రోడ్డు నిర్మించారు. ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసిన కాంట్రాక్టరును బ్లాక్‌ లిస్టులో పెట్టాలని, పర్యవేక్షించిన ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తరువాత ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సిఫారసు మేరకు కౌన్సిల్‌ ఆమోదం తెలపడం చూస్తే వారిని రక్షించేందుకే కౌన్సిల్‌ను వాడుకున్నారని తెలుస్తున్నది. ఆదోని పట్టణంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తే భారీ అక్రమాలు వెలుగు చేసే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. దీనిపై ఆదోని మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ, మున్సిపల్‌ ఇంజనీరు (ఎంఈ) ఇంతియాజ్‌ అలీ వివరణ కోసం ఆంధ్రజ్యోతి ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Oct 25 , 2024 | 12:08 AM