కేంద్ర దర్యాప్తు సంస్థ పేరుతో బెదిరింపులు
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:40 AM
కేంద్ర దర్యాప్తు సంస్థ పేరుతో కొంతమంది యువకులు శనివారం రచ్చ రచ్చ చేశారు. ఓ బియ్యం వ్యాపారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.
బియ్యం వ్యాపారి, డీఎస్పీపై నకిలీ అధికారుల చిందులు
అనుమానం రావడంతో అదుపులోకి..
కర్నూలు క్రైం/ఓర్వకల్లు, అక్టోబరు 19, (ఆంధ్రజ్యోతి): కేంద్ర దర్యాప్తు సంస్థ పేరుతో కొంతమంది యువకులు శనివారం రచ్చ రచ్చ చేశారు. ఓ బియ్యం వ్యాపారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. అనంతరం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీరా వారంతా నకిలీ మీడియా రిపోర్టర్లని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా రాచర్లకు చెందిన పాలకీటి మధుసూదన్, తాళ్లపల్లె గ్రామానికి చెందిన సీలం అంకిరెడ్డి, పాణ్యం మండలం మత్తూరుకు చెందిన పరదేశి రవికుమార్, నంద్యాల పట్టణానికి చెందిన కొరతాల మహేష్, ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన ఆవుల మధులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ జర్నలిస్టులు, కేంద్ర అధికారుల గుర్తింపు కార్డులను తయారు చేసుకున్నారు. వీరందరూ నంద్యాల, కర్నూలులో నివాసం ఉంటూ నకిలీ విలేకరులుగా, అధికారులుగా చెలామణి అయ్యేవారు. ఈ ఐదుగురు కలిసి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు రాగమయూరి కాలనీలో బియ్యం వ్యాపారం చేసే బెస్త గంగాధర్ ఇంటికి వెళ్లారు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థ కమిషన్ నుంచి వచ్చామని చెప్పారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్నావంటూ బెదిరించి రూ.5లక్షలు డిమాండ్ చేశారు. అయితే గంగాధర్ రూ.10 వేలు ఇవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడి నుంచే కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌కు ఫోన్ చేశారు. ‘మేము ఢిల్లీ నుంచి వచ్చిన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా.. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ సభ్యులమంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ గంగాధర్ అనే వ్యక్తి బియ్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తుంటే మీ పోలీసులు నిద్రపోతున్నారా’ అంటూ డీఎస్పీపై చిందులు తొక్కాడు. ఇందుకు డీఎస్పీ స్పందిస్తూ ‘మీరు నిజంగా కమిషన్ అయితే.. అలా నేరుగా రైడింగ్‌కు వెళ్లకూడదని, రెవెన్యూ అధికారులను గానీ, పోలీసులనుగానీ సంప్రదించి రైడింగ్ జరపాలని’ సూచించాడు. దీంతో డీఎస్పీపై నిందితులు మరింత రెచ్చిపోయారు. ‘మీపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. ముందు నువ్వు ఇక్కడకు రావాలంటూ’ హుకుం జారీ చేశారు. డీఎస్పీకి అనుమానం రావడంతో అక్కడకు వెళ్లాలని కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడును ఆదేశించారు. దీంతో ఆయన ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్ కుమార్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని వారిని ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా నకిలీ అధికారులు స్టేషన్‌లోని పుస్తకాలను చిందరవందర చేస్తూ ‘ఢిల్లీ అధికారులంటే లెక్కలేదా..’ అంటూ నానా హంగామా చేశారు. చివరికి వారి ఐడీ కార్డులు నకిలీవి అని నిర్ధారించుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో ఈ కేసు దర్యాప్తు చేయవద్దని, ఏదో తెలియక చేశారంటూ పెద్దఎత్తున పోలీసులకు ఫోన్లు వచ్చాయి.
ఢిల్లీలో ఫార్చునర్ వాహనం కొనుగోలు
నిందితుడు ఢిల్లీలో ఫార్చునర్ వాహనం రూ.15 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఢిల్లీ రిజిస్ర్టేషన్‌ను ఏపీ రిజిస్ర్టేషన్‌గా మార్చుకోకుండానే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ రిజిస్ర్టేషన్ అయితే ఎలాంటి అనుమానం రాదని ఇలాంటి వాహనం వాడుతున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. గతంలో కూడా బనగానపల్లెలో ఓ బియ్యం వ్యాపారి నుంచి రూ.1.15 లక్షలు నగదు వసూలు చేసినట్లు తేలింది. నిందితుల్లో ఒకడైన ఉప్పలపాడుకు చెందిన ఆవుల మధు బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. జిల్లాలో బియ్యం వ్యాపారం చేసే ప్రధాన వ్యక్తులు కూడా మధుకు తెలుసు. ఇలా బియ్యం వ్యాపారం చేసే వారిని టార్గెట్ చేశారు. ఆవుల మధు కూడా గంగాధర్ వద్ద బియ్యం వ్యాపారం చేసేవాడు. గంగాధర్‌ను బెదిరిస్తే డబ్బులు వస్తాయనీ ప్రణాళిక రూపొందించింది ఆవుల మధునే కావడం కొసమెరుపు.