సచివాలయ ఉద్యోగి చేతివాటం
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:55 PM
సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. రూ.2.16 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేశాడు.

రూ.2.16 లక్షల పింఛను సొమ్ము స్వాహా
ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా అధికారులు
కోవెలకుంట్ల, జూలై 5: సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. రూ.2.16 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేశాడు. వివరాలిలా.. కోవెలకుంట్ల పట్టణంలోని ఓ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంటుగా 2020 నుంచి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నాడు. తరువాత చనిపోయిన వారివి, మిగిలిన డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించకుండా తన సొంత అవసరాలకు వాడుకుంటూ వచ్చాడు. ఇలా ప్రతి నెలా కొంత కాలం సొమ్ము వాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఆ సచివాలయ ఉద్యోగిని మందలించి మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయారు. మండల స్థాయి అధికారి స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేసి ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారులకు లెటరు పెట్టారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ జిల్లా అధికారి ఆ సచివాలయ ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ ఉద్యోగి తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పింఛను డబ్బు లు స్వాహాపై విచారణ జరిపించి ఆ సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పింఛను డబ్బులు స్వాహా అయిన విషయంపై ఈవో గోపినాథ్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఆ సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులు స్వాహా చేసిన విషయం వాస్తవమేన ని, ఆ డబ్బులు రికవరీ కోసం గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులకు తెలిపామని వివరించారు.