Share News

ఘనంగా లక్ష్మమ్మవ్వ రథోత్సవం

ABN , Publish Date - May 30 , 2024 | 11:56 PM

ఆదోని పురప్రజల ఆరాధ్యదైవం ఆదోని లక్ష్మమ్మవ్వ రథోత్సవం గురువారం కన్నులపండువగా సాగింది.

ఘనంగా లక్ష్మమ్మవ్వ రథోత్సవం

జనసంద్రమైన ఆదోని పట్టణం

ఆదోని, మే 30: ఆదోని పురప్రజల ఆరాధ్యదైవం ఆదోని లక్ష్మమ్మవ్వ రథోత్సవం గురువారం కన్నులపండువగా సాగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంపై లక్ష్మమ్మవ్వను అలంకరించారు. ముందుగా లక్ష్మమ్మ పుట్టినిల్లు ముసానహళ్లి గ్రామం నుండి పల్లకి ద్వారా భజనలతో ఆలయం చేరుకున్నారు. సాయంత్రం అవ్వ రథోత్సవం వేలాదిమంది భక్తుల నడుమ కొనసాగింది. జయహో.. లక్ష్మాంబికా దేవి జయహో.. జయహో లక్ష్మమ్మవ్వ మాత... అంటూ అవ్వనామ స్మరణతో పురవీధులు భక్తతత్వంతో ప్రతిధ్వనించాయి. బ్రాహ్మణ వీధి నుంచి ప్రారంభమైన అవ్వ రథోత్సవం హవన్నపేట కూడలి, బుడ్డేకల్‌ సర్కిల్‌, పూల జబార్‌, షరాప్‌ బజార్‌ మీదుగా సాగి.. యఽథాస్థానం చేరుకోవడంతో ఉత్సవం ముగిసింది. రథోత్సవానికి కర్నూలు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొత్తగా పెళ్లయిన వందలాది జంటలు అమ్మవారి కలశం చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ బద్ధంగా కొత్తగా పెళ్లయిన నూతన జంట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కళశం చూసిన తర్వాతే ఏ శుభకార్యానికైనా వెళ్లవచ్చనేది ఈ ప్రాంతంలో భక్తుల నమ్మకం. రథోత్సవంలో ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, కూటమి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి, కాంగ్రెస్‌ అభ్యర్థి రమేష్‌ యాదవ్‌, దేవిశెట్టి ప్రకాష్‌ తదితరులు అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని డీఎస్పీ శివ నారాయణస్వామి ప్రారంభించారు. అవ్వ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శివ నారాయణస్వామి పర్యవేక్షణలో సీఐలు గోపీనాథ్‌, తేజమూర్తి, నిరంజన్‌ రెడ్డి, నరసింహరాజులు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - May 30 , 2024 | 11:56 PM