Share News

వైసీపీకి గుడ్‌బై..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:21 AM

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

వైసీపీకి గుడ్‌బై..!

అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ

టీడీపీలో చేరిన విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి

వైసీపీ కార్పొరేటర్‌ కైప పద్మలతారెడ్డి కూడా..

అదే బాటలో మరో ఐదుగురు కార్పొరేటర్లు

అధికార పార్టీలో అలజడి

కర్నూలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. దీంతో అధికార పార్టీలో అలజడి చెలరేగుతోంది. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ సీట్లాటకు తెర తీశారు. సీటు రాదని తెలిసిన ప్రజాప్రతినిధులు, వైసీపీలో ప్రాధాన్యత దక్కని నాయకులు రాజీనామాల పర్వానికి తెర తీశారు. తాజా పరిణామాలతో వైసీపీలో కలకలం మొదలైంది. మరోసారి టికెట్‌ ఆశించిన కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌కు జగన్‌ మొండి చేయి చూపారు. దీంతో ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. 24 గంటలు కూడా గడవకనే నగరంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె వైసీపీ కార్పొరేటర్‌ కైప పద్మలతారెడ్డి, అశోక మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల అధినేత కైప అశోక్‌ కుమార్‌రెడ్డిలు గురువారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అదే బాటలో మరో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు.

ఎంపీ సంజీవ్‌ బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు?

జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న తాజా ఎమ్మెల్యేలు ఒకరిద్దరు సీటు రాదని తెలిసి ఆ వైసీపీ గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే అధిష్టానం నుంచి పిలుపు వచ్చి టికెట్‌ నిరాకరిస్తే అదే రోజు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో రాజకీయ అరంగ్రేటం చేసిన చేనేత పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎన్నికల్లో ఖర్చులు, సీటు కోసం రూ.కోట్లు ఖర్చు చేశాడు. తీరా ఎంపీగా గెలిచాక ఆయా ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఏ నియోజకవర్గంలోకి వెళ్లకుండా సీఎం జగన్‌ రాజకీయ సంకెళ్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నిస్తే సీఎం జగనే కాదు సీట్లాటలో కీలకంగా వ్యవహరించే సజ్జల, మిఽథున్‌రెడ్డి, ధనుంజయరెడ్డి వంటి వారు కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఎంపీ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండానే పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిని మార్చడాన్ని సంజీవ్‌కుమార్‌ జీర్ణించుకోలేకపోయారు. మనస్థాపానికి గురై వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనను ఆపేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మేయర్‌ బీవై రామయ్య సహా సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎంపీ సంజీవ్‌కుమార్‌ బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి పిలుపు రాగానే వెళ్లి టికెట్‌ నిరాకరిస్తే అక్కడే రాజీనామా లేఖను ఇచ్చి వచ్చేందుకు సిద్ధమవుతున్నారట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. ఈ విషయం తెలిసిన వైసీపీ అధిష్టానం ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అనే సమాచారం రాబడుతోంది. ఇక టీడీపీలోకి వలసలు వెళ్లకుండా కట్టడి చేయాలని వైసీపీకి చెందిన కీలక నాయకులు పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆ పార్టీకి చెందిన పలువురు చెబుతున్నారు. ఎన్నికలు జరిగేవరకూ ఎలాగోలా టీడీపీలోకి చేరికలను అడ్డుకోవాలని వైసీపీలోని పెద్దలు జిల్లా నేతలకు సూచిస్తున్నారని సమాచారం.

టీడీపీలో చేరిన కేవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ

కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు అశోక మహిళా ఇంజనీరింగ్‌ కైప అశోక్‌ కుమార్‌రెడ్డి, కుమార్తె 17వ వార్డు వైసీపీ కార్పొరేటర్‌ కైప పద్మలతారెడ్డిలు వైసీపీలో కీలక నాయకులుగా కొనసాగారు. అయినప్పటికీ వారి సేవలను వైసీపీ అధిష్టానం గుర్తించలేకపోయింది. దీంతో ఆ పార్టీలో ఇమడలేక కేవీ సుబ్బారెడ్డి కుటుంబం టీడీపీలో చేరిపోయింది. కర్నూలు టీడీపీ ఇన్‌చార్జి టీజీ భరత్‌ కూడా వారి చేరికను స్వాగతించారు. దీంతో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిలతో కలసి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు మంగళగిరికి చేరుకున్నారు. అక్కడ లోకేశ్‌ను కలిసి టీడీపీ కుండవాలు కప్పుకున్నారు. జిల్లాలో వైసీపీకి రాజీనామాలు.. టీడీపీలో వలసలు పెరగడంతో అధికార పార్టీ నాయకులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం సుబ్బారెడ్డి కుటుంబం పని చేసిందని అంటున్నారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవీ సుబ్బారెడ్డి కుమార్తె కైప పద్మలతారెడ్డి 17వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. డిప్యూటీ మేయర్‌ పదవి ఆశ చూపి నిరాశకు గురి చేశారు. ఇదిలా ఉండగా కార్పొరేటర్‌ పద్మలతారెడ్డి బాటలోనే మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. వారిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. వారిని ఆపేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్‌ బీవై రామయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jan 12 , 2024 | 12:21 AM