Share News

ఉర్దూ వర్సిటీకి మంచి రోజులు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:11 AM

ఉర్దూ యూనివర్సిటీకి 144 ఎకరాలు అవసరమా..?

ఉర్దూ వర్సిటీకి మంచి రోజులు

శాపంగా మారిన గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం

ఈ వర్సిటీని ఎత్తేసి ఆర్‌యూలో విలీనం చేయాలనే ఎత్తుగడ

144 ఎకరాలు కబ్జాకు తెరవెనుక కుట్ర

టీడీపీ ప్రభుత్వం రావడంతో ఉర్దూ విద్యార్థుల్లో చిగురిస్తున్న ఆశలు

అసంపూర్తి పనులకు రూ.49 కోట్లు అవసరం

‘ఉర్దూ యూనివర్సిటీకి 144 ఎకరాలు అవసరమా..? అసలు వర్సిటీనే అవసరం లేదు.. రాయలసీమ విశ్వవిద్యాలయంలో కలిపేసి ఉర్దూ విభాగం (డిపార్ట్‌మెంట్‌) పెడితే సరిపోదా...’ గత వైసీపీ ప్రభుత్వంలో యూనివర్సిటీలపై సమీక్షా సందర్భంగా కీలక హోదాలో ఉన్న ఓ ప్రజాప్రతినిఽధి కలెక్టరుతో అన్న మాటలివి. అంటే రాష్ట్ర విభజన తరువాత ఆనాటి సీఎం చంద్రబాబు కర్నూలుకు ఉర్దూ యూనివర్సిటీ మంజూరు చేయడం.. ఓర్వకల్లు వద్ద 144 ఎకరాలు కేటాయించి శాశ్వత భవనాలు నిర్మాణం చేపట్టడం గత వైసీపీ ప్రభుత్వం పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకేనేమో ఉద్దేశపూర్వకంగా ఉర్దూ వర్సిటీ భవనాల నిర్మాణ పనులు ఆపేశారు. ఐదేళ్లలో ఉర్దూ వర్సిటీని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న వర్సిటీ భూములు కొట్టేయాలనే కుట్రలో భాగంగానే ఉర్దూ వర్సిటీని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. రూ.49 కోట్లు ఇస్తే ఏడాదిలోగా ఓర్వకల్లు కేంద్రంగా డాక్టరు అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థుల సేవలో తరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

కర్నూలు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏకైక ఉర్దూ వర్సిటీ ‘మౌలానా అజాద్‌ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ’ హైదరాబాదులో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఉర్దూ చదువుకోవాల్సిన ముస్లిం విద్యార్థులు హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి. అప్పటి సీఎం చంద్రబాబు అత్యధిక ముస్లిం జనాభా కలిగిన కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం స్థాపించాలని తపించారు. 2016లో ఏపీ స్టేట్‌ లెజిస్లేచర్‌ యాక్ట్‌-2016 ప్రకారం డాక్టరు అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాయం ఏర్పాటు చేయడమే కాకుండా కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో తాత్కాలిక గదుల్లో ప్రారంభించారు. 2017-18 విద్యా సంవత్సరంలో ఉర్దూ, ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్స్‌, ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలు, 150 మంది విద్యార్థులతో బోధనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నాలుగు పీజీ గ్రూపులు సహా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అదనంగా ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల, ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు ఆయా కోర్సులలో పీజీ, డిగ్రీ చదువుతున్నారు. యూనివర్సిటీ అకాడమిక్‌ బ్లాక్‌ సహా హస్టళ్లు, పరిపాలన భవనాలు.. ఇలా అన్నింటికి 55-60 వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాల అవసరం ఉంది. తాజాగా 22 వేల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ఓ ప్రైవేటు భవనంలో ఉర్దూ వర్సిటీ నడుతున్నారు. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, హరియాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ఈ వర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా.. కనీస సౌకర్యాలు లేక రాలేకపోతున్నారు.

ఐదేళ్ల నిర్లక్ష్యం.. ఉర్దూ విద్యార్థులకు శాపం

గత జగన్‌ ప్రభుత్వం ఉర్దూ విశ్వవిద్యాలయంపై చూపిన ఐదేళ్ల నిర్లక్ష్యం ఉర్దూ వర్సిటీలో చదివే వందలాది మంది విద్యార్థులకు శాపంగా మారింది. దేశంలో రెండవ ఉర్దూ విశ్వవిద్యాయలం కోసం ఓర్వకల్లు విమానాశ్రయం పక్కనే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 144.92 ఎకరాలు భూములు కేటాయించింది. ఫేజ్‌-1 కింద అకడమిక్‌ బ్లాక్‌, బాలికల హాస్టళ్లు, విశాలమైన రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు రూ.18 కోట్లు కేటాయించారు. హైదరాబాదుకు చెందిన యారో కన్‌స్ట్రక్షన్‌ సంస్థ పనులను చేపట్టింది. అకాడమిక్‌ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ 75 శాతం, ఫస్ట్‌ఫోర్‌ 25 శాతం పనులు చేశారు. బాలిక హాస్టళ్లు బేస్‌మట్టం, పిల్లర్ల వరకు నిర్మించారు. 2019 మేలో కొలుదీరిన జగన్‌ ప్రభుత్వం ఎక్కడి పనులు అక్కడే ఆపేసింది. ఆయన తీసుకొచ్చిన రివర్స్‌ టెండర్ల నిర్వహించి మళ్లీ పనులు మొదలు పెడుతారని ఆశిస్తే.. ఐదేళ్లలో ఒక్క ఇటుక పేర్చలేదు.. గంపెడు సిమెంట్‌ వేయలేదు. ఫలితంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం.. విధ్వంస పాలనకు మూగసాక్షంగా మొండి గోడలు దర్శనం ఇస్తున్నాయి.

వర్సిటీ భూములు కొట్టేయాలనే కుట్ర

ఉర్దూ వర్సిటీకి కేటాయించిన 144.92 ఎకరాలు ఎంతో విలువైన భూములు. ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌ ఎదురుగా కర్నూలు-చిత్తూరు వయా నంద్యాల జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. ఈ భూములపై కన్నేసిన గత వైసీపీ ప్రభుత్వంలో కీలక హోదాలో నంబరు టూగా చక్రం తిప్పిన ఓ ప్రజాప్రతినిధి, జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి కాజేయాలనే కుట్రలో భాగంగానే ఉర్దూ వర్సిటీ పనులు చేయకుండా ఆపేశారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అప్పటి కలెక్టర్‌ అధ్యక్షతన యూనివర్సిటీలపై సమీక్ష సందర్భంగా ఉర్దూ వర్సిటీకి ఎంతో విలువైన వందల ఎకరాల భూములు అవసరమా..? ఈ యూనివర్సిటీని రాయలసీమ వర్సిటీలో విలీనం చేసి ఉర్దూ డిపార్ట్‌మెంట్‌ (విభాగం) పెడితే సరిపోదా..? ఆని ప్రజాప్రతినిధులు అన్నట్లు వర్సిటీ అధికారులే చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఉద్ధేశపూర్వకంగానే ఉర్దూ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.49 కోట్లు ఇస్తే..

అసంపూర్తిగా అకాడమిక్‌ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, బాలిక హాస్టళ్లు, ఇంటర్నల్‌ రోడ్లు, ప్రహరీ నిర్మాణం, విద్యుత్‌, తాగునీరు, ఫర్నిచర్‌.. వంటి వాటికి తక్షణం రూ.49 కోట్లు అవసరం అని ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు ఉర్దూ వర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులు, పరిపాలన అనుమతులు తీసుకురావాల్సి ఉంది. నిధులు ఇస్తే ఏడాదిలోగా పూర్తి చేసి విద్యార్థులకు అధునాతన సౌకర్యాలతో అందమైన భవనాలు అందిస్తామని అధికారులు అంటున్నారు. 2017-18లో పునాదిరాయి వేసి పనులు చేపట్టిన ఆనాటి టీడీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబే పూర్తి చేసి విద్యార్థులకు అంకితం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:11 AM