Share News

రాఘవేంద్రస్వామి గర్భగుడికి బంగారు తాపడం

ABN , Publish Date - May 29 , 2024 | 11:52 PM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గర్భగుడి శిలాఫలకం స్వర్ణమయం కానుంది. బెంగుళూరు నుంచి భక్తులు తయారు చేయించిన బంగారు తాపడం రేకులను బుధవారం రాత్రి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రాఘవేంద్రస్వామి బృందావనం ఎదుట ఉంచి పూజలు నిర్వహించారు.

రాఘవేంద్రస్వామి గర్భగుడికి బంగారు తాపడం

శ్రీమఠానికి చేరుకున్న స్వర్ణ కవచాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతి

మంత్రాలయం, మే 29: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గర్భగుడి శిలాఫలకం స్వర్ణమయం కానుంది. బెంగుళూరు నుంచి భక్తులు తయారు చేయించిన బంగారు తాపడం రేకులను బుధవారం రాత్రి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రాఘవేంద్రస్వామి బృందావనం ఎదుట ఉంచి పూజలు నిర్వహించారు. గర్భగుడి శిలాఫలకం తూర్పు భాగాన మహా ముఖద్వారం ఎదుట మరో రెండు నెలల్లో బంగారు కవచ అలంకరణ పూర్తవుతుందని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు తెలిపారు. రాఘవేంద్రస్వామి మఠం నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండా భక్తులే శిలామండపాన్ని బంగారు కవచాలతో స్వర్ణమయం చేయనున్నారు. అయోధ్యలోని రామ మందిరానికి విద్యుత్‌ అలంకరణ చేసిన శంకర్‌ ఎలక్ర్టికల్స్‌ 6వేల కిలోల రాగిని విరాళంగా ఇచ్చారు. బెంగుళూరు చెందిన శ్రీనివాస్‌ అనే ప్రముఖ శిల్పికారుడు బంగారు కవచాలను సుందరంగా తీర్చిదిద్ది బుధవారం రాత్రి మంత్రాలయం తీసుకువచ్చారు. ఇప్పటికే గర్బగుడి తూర్పు వైపున ఉన్న రాగిని అమర్చడం పూర్తి కావడంతో గురువారం నుంచి బంగారు కవచాలను అమర్చుతారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మహా మంగళహారతులు ఇచ్చి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మఠం పండిత కేసరి రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్‌ రాజా ఎస్‌.గిరిరాజాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్‌ జోషి, శ్రీపతాచార్‌, ఐపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:52 PM