వైభవంగా వెండి రథోత్సవం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:47 PM
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

శ్రీశైలం, జూలై 8: శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై అశీనులనుజేసి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు ఇచ్చి ఆలయ ప్రాంగణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో సోమవారం పశ్చిమ గోదావరికి చెందిన ఉమామహేశ్వర కూచిపూడి కళాక్షేత్రం బృందంతో కూచిపూడి నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏకదంతాయ, భో..శంభో, లింగాష్టకం, మూషికవాహన, శంభోమమోదేవ తదితర గీతాలకు కళాకారులు నృత్య ప్రదర్శనతో అలరించారు.