Share News

కౌలు రైతులకు రుణాలు ఇవ్వండి: జేసీ

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:19 AM

జిల్లాలో సీసీ ఆర్సీ కార్డులు మంజూరు చేసిన 22,740 మంది కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు.

కౌలు రైతులకు రుణాలు ఇవ్వండి: జేసీ
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

నంద్యాల (కల్చరల్‌), జూలై 4: జిల్లాలో సీసీ ఆర్సీ కార్డులు మంజూరు చేసిన 22,740 మంది కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా బ్యాంకర్ల సమస్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూబీఐ డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ సురేందర్‌గౌడ్‌, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ కె మహాన, నాబార్డ్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ సుబ్బారెడ్డి, డీఆర్‌డీఏ ఏపీ శ్రీధర్‌రెడ్డి, లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులందరికీ పంట రుణాలు మంజూరుచేయడంతో పాటు జిల్లాలోని 22,748 మంది కౌలు రైతులకు మరింత చేయూత అందించి పెద్దఎత్తున్న రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను సూచించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద పట్టాలు ఇచ్చిన రైతులకు కూడా రుణాలు అందజేయాలన్నారు. పాడిపరిశ్రమకు ప్రభుత్వం తగిన ప్రాధానమిస్తోందని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు, ఉపాధియూనిట్ల స్ధాపన, చిన్న మద్య తరహా, విద్య, గృహ,రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రంగాలలో వారికి అర్హులకు వారందరికి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. పీఎంఈజీపీ, ముద్ర స్కీము రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమ యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 18,258 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.780కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.1406 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసి 180 శాతం లక్ష్యాన్ని సాంధించినట్లు తెలిపారు. అలాగే పంట రుణాల కింద రూ.5384 కోట్లు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.8672 కోట్లు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల రుణాల కింద రూ.1335 కోట్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ కింద రూ.987 కోట్లు, విద్యా రుణాల కింద రూ.46 కోట్లు, గృహ రుణాల కింద రూ. 57కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.10,953కోట్లు మంజూరు చేసినట్లు జేసీ వివరించారు. వ్యవసాయ, అనుబంధ, పారిశ్రామిక ఇతర ఉపాధి రంగాలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన రుణ వివరాలను ఎల్డీఎం రవీంద్ర కుమార్‌ వివరించారు. సమావేశంలో బ్యాంకు అధికారులు, సంక్షేమశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:19 AM