Share News

వైభవంగా గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - May 24 , 2024 | 01:03 AM

శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

వైభవంగా గిరి ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీశైలం, మే 23: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జున సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, అక్కడి నుంచి వలయదారి మీదుగా గణేష సదనం, సారంగఽధర మండపం, గోశాల, మల్లమ్మ కన్నీరు, మహిషాసురమర్థిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం చేరుకొని తిరిగి నంది మండపానికి చేరుకుంది. క్షేత్రపరిధిలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచే దర్శింపచేస్తూ భక్తులలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ, క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిన కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది.

లక్ష కుంకుమార్చన: శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు పూజా సంకల్పం పఠించి అనంతరం మహాగణపతికి పూజలు చేశారు. తరువాత శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చనను జరిపించారు. భక్తులు వారి గోత్రనామాలతో లక్షకుంకుమార్చనలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్ష సేవ ద్వారా అవకాశం కల్పించింది. శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.1,116 సేవా రుసుము చెల్లించి పరోక్షసేవలో పాల్గొనవచ్చును. కాగా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు మొత్తం 28 మంది భక్తులు ఈ సేవలో పాల్గొన్నట్లు దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు కోరారు.

ఊయలసేవ: శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించి పల్లకీలో ఆశీనులనుజేశారు. ఆలయ ప్రాంగణంలో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - May 24 , 2024 | 01:03 AM