Share News

తొలకరి పలకరింపు

ABN , Publish Date - May 16 , 2024 | 11:15 PM

ఎండలు మండిపోతోంటే సేదతీర్చేలా తొలకరి వానలు మొదలయ్యాయి. వేసవి తాపం తీరి ప్రకృతి అంతా చల్లబడింది.

తొలకరి పలకరింపు

మండలంలో మొదలైన వేసవి దుక్కులు

ఆదిలోనే 8 సెం.మీల వర్షం..

ఆనందంలో అన్నదాతలు

మద్దికెర, మే 16: ఎండలు మండిపోతోంటే సేదతీర్చేలా తొలకరి వానలు మొదలయ్యాయి. వేసవి తాపం తీరి ప్రకృతి అంతా చల్లబడింది. గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో 3 సెం.మీల వర్షపాతం నమోదైతే.. ఈ ఏడాది ఆదిలోనే 8 సెం.మీల వర్షం పడింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాకపోవడంతో రైతులు ఈ ఖరీఫ్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మండలంలో మొత్తం 11 గ్రామలున్నాయి. 22,500 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఖరీఫ్‌లో 7,500 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయగా.. ఈ ప్రాంతంలో వేరుశనగ పంటలను ఎక్కువ శాతం సాగు చేస్తారు. పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవడం వల్ల నేలల్లో వర్షం నీరు ఇంకిపోయి అక్కడిక్కడే నీరు ఇంకిపోతుంది. భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. వేసవిలో దున్నడం వల్ల నేల పొరల్లో ఉన్న క్రిములు, కీటకాలు దశలోనే బయటపడటంతో కలుపు విత్తనాలు కూడా నశిస్తాయి. దుక్కులు చేసుకోవడం వల్ల జూన్‌లో కురిసే వర్షాలకు పంటలు సాగు చేసుకోవడం సులభమవుతుంది. వేసవిలో దుక్కులను దున్నుకోవడం వల్ల పంట భూములకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వ్యవసాయాధికారి రవి అన్నారు. భూమిలో తేమ శాతం పెరుగుతుందని అన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:15 PM