Share News

రైతులు లేని రైతుబజార్లు

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:23 AM

రైతు బజారులు రైతుల కోసం ఏర్పాటు చేశారు.

రైతులు లేని రైతుబజార్లు
కొత్తపేట రైతుబజారులో కనిపించని రైతులు

వ్యాపారులదే ఇష్టారాజ్యం

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ఏడీఎం నారాయణమూర్తి

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 27: రైతు బజారులు రైతుల కోసం ఏర్పాటు చేశారు. రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా ప్రజలకు తక్కువ ధరకే విక్రయించి, దళారుల, వ్యాపారుల బెడద లేకుం డా లాభాలు పొందడం వీటి లక్ష్యం. గత టీడీపీ హయాంలో రైతుబజార్లు ఏర్పాటయ్యాయి. మొదట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో సీ.క్యాంపు రైతుబజారు, కొత్తపేటలో, అమీన్‌ అబ్బాస్‌ నగర్‌లలో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఆదోని, నంద్యాల పట్టణాల్లోనూ వీటిని నెల కొల్పారు. క్రమక్రమంగా ఈ రైతుబజార్లలో రైతులను పక్కకు తప్పించి వ్యాపారులకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షాపుల కేటాయింపులో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సీ.క్యాంపు రైతుబజారులో సగటున ప్రతి రో జు ఆరేడువేల మంది వినియోగదారులు కూరగాయలు కొనడానికి వస్తుంటారు. కొత్తపేట, అమీన్‌అబ్బాస్‌ నగర్‌ రైతుబజార్లకు మరో 2 వేల మంది వస్తున్నారు. గత టీడీపీ హయాంలో ఈ రైతుబజార్లకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం ఇవ్వడం లేదని, అందువల్లనే తమకు రైతుబజార్లల్లో కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాస్తో.. కూస్తో సీ.క్యాంపు రైతుబజారులో వివిధ గ్రామాల నుంచి రైతులు కూరగాయలు తీసుకు వచ్చి అమ్ముకుంటున్నారు. కొత్తపేట, అమీన్‌ అబ్బాస్‌నగర్‌ రైతుబజార్లలో, నంద్యాల, ఆదోని నగరాల్లోని రైతుబజార్లల్లో పూర్తిగా వ్యాపారులే తిష్ట వేశారు. బయటి మార్కెట్‌ ధరలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ రైతుబజార్లల్లో వ్యాపారులు పోటాపోటీగా ధరలు పెంచి కూరగాయలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగ రంలోని రైతుబజార్లల్లో మాన్యువల్‌ కాటాలు తప్ప.. ఎలక్ర్టానిక్‌ కాటాలు వినియోగంలో లేవు. దీని వల్ల అసలే మండిపోతున్న కూరగాయలకు తోడు తక్కువ తూకంతో కూరగాయలను విక్రయిస్తున్నారని, దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దా దాపు రూ.5కోట్ల ఖర్చుతో పాడుబడిన రెవెన్యూ క్వాటర్స్‌ను సీ. క్యాంపు రైతుబజారుకు స్వాధీనం చేశారు. అయితే పెరిగిన ధరల వల్ల విస్తరణ పనులు గత నాలుగేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అదే విధంగా కొత్తపేట, అమీన్‌ అబ్బాస్‌నగర్‌ రైతు బజార్లలో కూడా రైతులు మరో వైపు వ్యాపారుల కోసం వివిధ వసతులు ఏర్పాటు చేసేందుకు నిధులు అందించాలని అధికారులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం శోచనీయం. కల్లూరు పారిశ్రామికవాడలో కూడా రైతు బజారు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిం చకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆ రైతుబజారు ముళ్లకంపలతో నిండిపోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు

నాణ్యమైన కూరగాయలను ప్రజలకు అందించడం, రైతులకు మద్దతు ధర అందించడం రైతు బజార్ల లక్ష్యం. ఎవరైనా వ్యాపారులు రైతుబజార్లలో కూరగాయలు విక్రయిస్తుంటే.. మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. రైతులకు అవగాహన కల్పిస్తున్నా రైతు బజా రుకు కూరగాయలు తీసుకుని వచ్చి అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

- నారాయణమూర్తి, ఏడీఎం

Updated Date - Jan 28 , 2024 | 12:24 AM