Share News

పత్తిపైనే రైతుల ఆశలు

ABN , Publish Date - May 27 , 2024 | 11:33 PM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతన్నలు పత్తి, ఉల్లి, పంటలపైనే ఆశలు పెట్టుకున్నారు.

పత్తిపైనే రైతుల ఆశలు

30 వేల హెక్టార్లలో సాగుకు సిద్ధం

గోనెగండ్ల, మే 27: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతన్నలు పత్తి, ఉల్లి, పంటలపైనే ఆశలు పెట్టుకున్నారు. అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలాలను దుక్కిదున్ని పంటల సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరు సెక్షన్‌ పరిధిలోని గోనెగండ్ల, ఎమ్మిగనూరు. నందవరం మండలాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 45 వేల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే నియోజకవర్గంలోని రైతులు ఎక్కువగా పత్తి పంటపైనే ఆసక్తి చూపుతున్నారు. బావులు, బోర్ల దగ్గర పత్తి పంటను సాగు చేశారు.

ఎక్కువ ఈ గ్రామాల్లోనే..

గోనెగండ్ల మండలంలో గోనెగండ్ల, కులుమాల, అలువాల, చిన్నమరివీడు, వేముగోడు, తిప్పనూరు, బైలుప్పల, గంజహళ్లి, అగ్రహరం, పెద్దనేలటూరు, చిన్ననేలటూరు, నందవరం మండలంలో ముగతి, నాగలదిన్నె, నందవరం, మిట్టసోమాపురం, గంగవరం, చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, హలహర్వి, మచాపురం, పులచింత, ఎమ్మిగనూరు మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంటను అధికంగా సాగు చేస్తారు. గత ఏడాది 30 వేల హెక్టర్లలో సాగు చేశారు. ఎకరం పత్తి పంట సాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుంది. 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. రూ. లక్ష నుంచి లక్ష యాభైవేల వరకు ఆదాయం వస్తుంది. అందువల్ల రైతులు పత్తి పంటపై ఆసక్తి చూపుతున్నారు. గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో అధికంగా బావులు బోర్ల కింద పత్తి సాగు చేశారు. అయితే ఆదివారం గోనెగండ్ల మండలంలో 2 సెం.మీ. వర్షం కురవడంతో చాలా మంది రైతులు ఉదయమే తమ పొలాల్లో పత్తి విత్తనాలు నాటడం మొదలు పెట్టారు. ఎంత లేదన్నా కనీసం రూ.6000 నుంచి రూ.8000 వరకైనా ధర పలుకుతుందన్న ధైౖర్యంతో పత్తి సాగు చేస్తున్నారు. ఎమ్మిగనూరు రూరల్‌ ఏరియాల్లో దాదాపు 12 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారు. గోనెగండ్ల, నందవరం, మండలాల్లో అధికంగా సాగు చేయనున్నారు. ఈ ఏడాది కూడా రైతులు ఇప్పటికే పత్తి పంటను అధికంగా సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Updated Date - May 27 , 2024 | 11:33 PM