Share News

అంచనాలు పెంచి.. నిధులు ఊడ్చి..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:37 AM

రూ. లక్షల్లో పూర్తయ్యే పనులకు రూ. కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపారు. అంచనాలు పెంచేసి పనులు కానిచ్చారు.

అంచనాలు పెంచి.. నిధులు ఊడ్చి..!

ఎంపీ నిధులతో ఇండోర్‌ స్టేడియం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం

రూ. లక్షలయ్యే పనులను రూ. కోట్లలో చూపుతున్న కాంట్రాక్టర్‌

భారీగా నిధుల దుర్వినియోగం

విచారణ జరపాలని డిమాండ్‌

ఆదోని, ఏప్రిల్‌ 2: రూ. లక్షల్లో పూర్తయ్యే పనులకు రూ. కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపారు. అంచనాలు పెంచేసి పనులు కానిచ్చారు. ఎంపీ నిధులను ఊడ్చేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ స్వగ్రామంలో కమ్యూనిటీ హాల్‌, ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి వెచ్చించిన డబ్బును చూసి జనం అవాక్కయ్యారు. అభివృద్ధి పనుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ఆరోపిస్తున్నారు.

ఆదోని నియోజకవర్గంలోని పెద్దతుంబలం మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ స్వగ్రామం. గ్రామాభివృద్ధిలో భాగంగా 2021లో పంచాయతీ పరిధిలోని స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి టీజీ నిధులను కేటాయించారు. రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆదోనికి చెందిన నాగరాజు అనే కాంట్రాక్టర్‌కు పంచాయతీరాజ్‌ శాఖ పనులను అప్పజెప్పింది. ఆయన పెద్దతుంబలం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బసవరాజుకు సబ్‌ కాంట్రాక్ట్‌ పనులు అప్పజెప్పాడు. ఆయన కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు పూర్తి చేశారు. కమ్యూనిటీ హాల్‌ లోపల భాగం ఫ్లోరింగ్‌ పనులు, స్లాబ్‌ చుట్టూ గోడలకు ప్లాస్టింగ్‌ చేయాల్సి ఉంది. అప్పటికే రూ.50 లక్షలు ఖర్చయిందని చూపించి నగదు డ్రా చేశారు. మిగిలిన పనులకు మరో రూ.20 లక్షలు అవుతుందని అంచనాలు పెంచి చూపించి పనులను నిలిపేశారు.

పర్సంటేజీల కోసమే అంచనాలు పెంచారు

సదరు కాంట్రాక్టర్‌ నుంచి పర్సెంటేజీ తీసుకోవడానికి భారీగా అంచనాలు పెంచి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌, అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. నిపుణుల చేత ఈ పనులపై విచారణ జరిపిస్తే ఏ పనికి ఎంత ఖర్చయిందీ, ఎంత వెచ్చించారు? అనే వాస్తవాలు తెలుస్తాయని ప్రజలు అంటున్నారు.

పనులు పూర్తి కాకుండానే పై అంతస్తులో ఇండోర్‌ స్టేడియం

గ్రామ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీ వెంకటేష్‌ తన ఎంపీ నిధుల నుంచి ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రూ.68 లక్షలు ఖర్చు అవుతాయని పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదనలు పంపింది. దీనికి టీజీ వెంకటేష్‌ ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇండోర్‌ స్టేడియం పనులు ఖాళీ స్థలంలో కాకుండా కమ్యూనిటీ హాలు పైనే ప్రారంభించారు. దీని వల్ల ఇండోర్‌ స్టేడియం నిర్మాణ వ్యయం తగ్గుతుంది. మొదటి అంతస్తు చుట్టూ గోడలు 5 అడుగులు లేపి, దాని పైన జీ సీట్స్‌ (ఇనుప రేకులు) వేశారు. రూఫ్‌ కూడా ఇనుప రేకులు వేయడంతో మరింత ఖర్చు మిగిలించుకున్నారు. ఈ మాత్రం పనులకు రూ.68 లక్షల ఖర్చు ఎందుకయిందో అర్థం కావడం లేదు.

పది అడుగుల గుంతలో నుంచి నిర్మాణం పట్టాం

కమ్యూనిటీ హాలు, ఇండోర్‌ స్టేడియం పనులను రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ నిధులతో చేపట్టాం. గ్రామంలో స్థలం లేకపోవడంతో పంచాయతీ పరిధిలోని లోతట్టు ప్రాంతమైన గుంతలో పది అడుగుల లోతు నుంచి పిల్లర్లు వేశాం. దీంతో వ్యయం పెరిగింది. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి విడుదలైన నిధులు చాలక పోవడంతో, నిర్మాణానికి కొరత ఏర్పడింది. ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ఒక్క పైసా కూడా నిధులు విడుదల కాలేదు. అయినా పనులు 95 శాతం పనులు పూర్తి చేశాం.

-బసవరాజు, సబ్‌ కాంట్రాక్టర్‌

అంచనాలు పెరిగిన మాట వాస్తవమే

పెద్దతుంబలం గ్రామంలో చేపట్టిన కమ్యూనిటీ హాల్‌కు నిధులు సరిపోలేదు. దీంతో అంచనాలు పెంచాల్సి వచ్చింది. ఈ విషయం ఎంపీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. నిధులు సరిపోకపోవడంతోనే ఫ్లోరింగు, ప్లాస్టింగ్‌ పనులను నిలిపివేశారు. ఈ పనులకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. నిధులు చాలక పనులను ఆపివేశారు. ఇందులో అవినీతికి తావు లేదు.

-మాలిక్‌, ఇంజనీర్‌, ఆదోని

Updated Date - Apr 03 , 2024 | 12:37 AM