Share News

భక్తులతో ఈవో సమావేశం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:06 AM

శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం కర్ణాటక, మహారాష్ట్ర పాదయాత్ర భక్తబృందాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

భక్తులతో ఈవో సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఈవో పెద్దిరాజు

శ్రీశైలం, మార్చి 26: శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం కర్ణాటక, మహారాష్ట్ర పాదయాత్ర భక్తబృందాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్‌ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించ నుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. ఈవో మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరగబోయే ఉగాది మహోత్సవాల సమయంలో భక్తులంద రికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. అయితే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. అయితే స్వామివారి స్పర్శదర్శనం రూ.500 టిక్కెట్టును ఒక్కొక్క విడతలో 1500 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో చలువపందిర్లు, మంచినీటి సౌకర్యం, శౌచాలయాలు, విద్యుత్‌ దీపాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛందసేవకుల సేవలను దేవస్థానం వినియోగించుకుంటుందని, లాటరీ పద్ధతిలో స్వచ్ఛంద సేవా బృందాలకు ఆలయం, క్షేత్రపరిధిలోని ప్రదేశాలలో కేటాయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో దేవస్థానం ఉప కార్యననిర్వహణాధికారి రమణమ్మ, దేవస్థాన పరిపాలన, ఆలయ ప్రజాసంబంధాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:06 AM