Share News

గెలుపు సంబరాలు చేసుకోవద్దు: డీఎస్పీ

ABN , Publish Date - May 23 , 2024 | 12:26 AM

ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఆర్వో దాసు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు రాజకీయ పార్టీలకు సూచించారు.

గెలుపు సంబరాలు చేసుకోవద్దు: డీఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు

నందికొట్కూరు, మే 22: ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఆర్వో దాసు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు రాజకీయ పార్టీలకు సూచించారు. బుధవారం పట్టణంలోని నందికొట్కూరు రిటర్నింగ్‌ అధికారి రూమ్‌లో ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో 10 టేబుళ్లలో 25 రౌండ్లు ఉంటాయని, ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంటును మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. మూడు అంచెల భద్రతా వలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం నెలకొన్న ఘటనల దృష్ట్యా ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చకూడదని వారు సూచించారు. జూన్‌ 6వ తేదీన ఎన్నికల కోడ్‌ ముగిసినా, 11వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ సీఐ ప్రకాశ్‌ కుమార్‌, రూరల్‌ సీఐ విజయభాస్కర్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, లాయర్‌ జాకీర్‌, తదితర పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:26 AM