దళారుల మాటలు నమ్మి మోసపోకండి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:27 PM
పోలీసు ఉద్యోగాల నియామక విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ జి.బిందుమాధవ్ తెలిపారు.
పారదర్శకంగా రిక్రూట్‌మెంటు
ఎస్పీ బిందుమాధవ్
కర్నూలు క్రైం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాల నియామక విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ జి.బిందుమాధవ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీసు కానిస్టేబుళ్ల ఈవెంట్లు జరుగుతాయని చెప్పారు. దేహదారుఢ్య పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 10,413 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి రోజు 600 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం తరుపున అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్ల అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించిన మొదలుకుని వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకుని మైదానం నుంచి తిరిగి వెళ్లే వరకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్ష ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన నిర్ణీత సమయాల్లో మాత్రమే ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లోకి చేరుకోవాలని తెలిపారు.. దేహధారుఢ్య పరీక్షలకు హాజరయ్యే కానిస్టేబుళ్ల అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎవరైనా దళారులు, మోసగాళ్లు సంప్రదిస్తే డయల్-100కు గానీ, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు ఇవ్వాలని ప్రచారం చేస్తే వారి సమాచారాన్ని డయల్ 100, 112 లేదా స్థానిక పోలీసులకు గానీ, పోలీసు వాట్సాప్ నెంబర్లు 7777877722, 9121101100లకు తెలియజేయాలని సూచించారు.