Share News

ఓటు పద్దు..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:29 AM

రెండు నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.

ఓటు పద్దు..!

300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ఇచ్చేలా సోలార్‌ పాలసీ

యథావిధిగా ఆదాయ పన్ను శ్లాబులు

వేతన జీవులకు కాస్త ఊరట

నానో డీఏపీ ద్వారా పెట్టుబడి తగ్గింపు

వెనుకబడిన జిల్లాలను విస్మరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌

కర్నూలు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రెండు నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ను పరిశీలిస్తే వేతన జీవులు, ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిస్తూ యథావిధిగా శ్లాబులు కొనసాగించారు. సబ్సిడీ తగ్గించుకొని కష్టజీవులపై ఎరువుల భారం మోపనుంది. పీఎం కిసాన్‌ సాయం పెంపు, నానో డీఏపీ తీసుకొచ్చి కష్టజీవుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. ఐఐఐటీడీఎం కాలేజీ, స్టేట్‌ క్యాన్సర్‌ యూనిట్‌, క్లస్టర్‌ యూనిర్సిటీలకు బడ్జెట్‌లో ప్రత్యేక స్థానం దక్కలేదు. ఈ ఏడాది ట్రిపుల్‌ ఐటీడీఎం కళాశాలలో జరిగే పనులకు రూ.60 కోట్లు నిధులు కావాలి. ఎంత ఇస్తారో స్పష్టత లేదు. విభజన హామీ ఊసే లేదు.

మధ్యంతర బడ్జెట్‌ అంటే..?

సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కుదరదు. అందుకే కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దీన్నే మధ్యంతర బడ్జెట్‌ (ఇంటెరిమ్‌ బడ్జెట్‌) అంటారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నారు కాబటి ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌’ అని పిలుస్తారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో తెలియదు. దీంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని మధ్యంతర బడ్జెట్‌లో పొందుపరుస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

నానో డీఏపీ ద్వారా పెట్టుబడి తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం గతేడాది నానో యూరియా తీసుకొచ్చింది. ఇది సక్సెస్‌ కావడంతో నానో డీఏపీ తీసుకొస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వివరించారు. ప్రస్తుతం డీఏపీ బస్తా (50 కిలోలు) రూ.1,350 ఉంది. ఎకరాకు రెండు బస్తాలు వేస్తే రూ.2,700 అవుతుంది. అదే నానో డీఏపీ (ద్రవ రూపం) ఎకరాకు అర లీటరు చాలని వ్యవసాయ శాస్త్రవేతలు అంటున్నారు. 500 మిల్లీ లీటర్లు (ఆర లీటరు) నానో డీఏపీ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.450 ఉందని ఎరువులు పురుగు మందుల విక్రయ డీలరు ఒకరు పేర్కొన్నారు. అంటే నానో డీఏపీ వల్ల ఎకరాకు రూ.2,250 పెట్టుబడి ఆదా అవుతుందని అంటున్నారు. జిల్లాలో 5 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. మిరప, వరి, పత్తి, వేరుశనగ, పప్పు శనగ సహా ఉద్యాన పంటలకు డీఏపీ రసాయ ఎరువులు తప్పక వేస్తున్నారు. వీరందరిని నానో డీఏపీ ద్వారా ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. పాడి రైతులకు ఊరట కలిగించేలా వివిధ పథకాలు అమలు చేస్తామని మంత్రి ప్రకటించడం రైతులకు కాస్త ఊరట లభిస్తుందనే చెప్పాలి.

పేదలకు సౌర విద్యుత్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారం పది రోజు ల క్రితం పేదల ఇళ్లలో సౌర వెలుగులు తీసుకొస్తా మని, కోటి ఇళ్లకు రూప్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ పథకం తెస్తామని ప్రకటించారు. అందుకు అనుగు ణంగానే కేంద్ర ఆర్థిక మంత్రి సోలార్‌ పాలసీ ప్రకటించారు. కోటి ఇళ్లకు రూప్‌ టాప్‌ సోలార్‌ పవ ర్‌ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తారు. తద్వారా 300 యూనిట్ల వరకు సౌర విద్యుత్‌ ఉచితంగా అందనుంది. ఈ పథకం ఏమేరకు విజయవంతం అవుతుందో చూడాలి. అలాగే.. పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్‌ పథకం’ గ్రామీణ, పట్టణ పేదలవాడల్లో పని చేసే ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు వర్తింప చేయనునన్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం జిల్లాలో పని చేసే వేలాది మంది ఆశాలు, అంగన్‌వాడీల కుటంబాలకు ఆరోగ్య రక్ష లభించినట్లు అవుతుంది.

వెనుకబడిన జిల్లాలకు మొండిచేయి..

రాయలసీమ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇస్తూ వచ్చారు. అయితే ఐదేళ్లుగా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. ఎన్నికల వెళ్ల ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిస్తే నిరాశే మిగిల్చారు. ట్రిపుల్‌ ఐటీడీఎం కాలేజీకు 2024-25 బడ్జెట్‌లో రూ.34 కోట్లు, వివిధ అభివృద్ధి పనులకు మరో రూ.60 కోట్లు నిధులు కావాలని అడిగారు. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేవు. అలాగే క్లస్టర్‌ యూనివర్సిటీ, స్టేట్‌ క్యాన్సర్‌ యూనిట్‌కు కూడా బడ్జెట్‌లో స్థానం దక్కలేదు. అయితే ఆయా శాఖలకే కేటాయించే బడ్జెట్‌లో మూడు నెలకు అవసరమైన నిధులు వస్తాయని అధికారులు అంటున్నారు. విభజన హామీ ఊసే లేదని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సీమకు తీరని అన్యాయం

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రానికి, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏ మాత్రం ప్రయోజనం లేని బడ్జెట్‌ ఇది. ఎన్నికల వేళ విభజన హామీలు అమలుపై బడ్జెట్‌లో ఎన్నో ఆశలు ఉండేవి. ఆశలపై కేంద్ర ఆర్థిక మంత్రి నీళ్లు చల్లారు. పైపై మెరుగులు దిద్ది ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి అంకెల పద్దులే తప్పా ఏపీకి ఏలాంటి ప్రయోజనం లేదు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేకపోవడం తీరని అన్యాయం చేసినట్లే.

- గిడ్డయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

సామాన్యుడి బడ్జెట్‌ ఇది : కునిగిరి నీలకంఠ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

సామాన్య ప్రజల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ రూపొందించారు. పీఎం ఆవాస్‌ యోజన కింద పేదలకు 2 కోట్లు ఇళ్లు, రూప్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ పాలసీ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాల ద్వారా సామాన్యులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Updated Date - Feb 02 , 2024 | 12:29 AM