Share News

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:28 PM

జెండాలు చేతబట్టి జేజేలు కొట్టాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తలే ఈ జెండా తమకొద్దంటూ కింద పడేసి కాళ్లతో తొక్కేశారు.

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

జడ్పీటీసీ, సర్పంచ్‌ వర్గాల మధ్య వాగ్వాదం

కుడా చైర్మన్‌ కోట్ల హర్ష, వైసీపీ అభ్యర్థి సతీష్‌ సమక్షంలోనే గొడవ

వైసీపీ జెండాలు తగలబడిపోకుండా మంటలు ఆర్పేసిన స్థానిక నాయకులు

కర్నూలు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జెండాలు చేతబట్టి జేజేలు కొట్టాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తలే ఈ జెండా తమకొద్దంటూ కింద పడేసి కాళ్లతో తొక్కేశారు. నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. స్థానిక నాయకులు అడ్డుకోవడంతో నిప్పు రగలకుండానే స్థానిక నాయకుల జోక్యంతో ఆర్పేశారు. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు, నాయకుల మధ్య వాగ్వాదం జెండాలకు నిప్పు పెట్టేలా చేసింది. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్‌, కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో గూడూరు మండలం ఆర్‌.ఖానాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కోడుమూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్‌, వైసీపీ సీనియర్‌ నాయకుడు, కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి గూడూరు మండలం ఆర్‌.ఖానాపురం గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన గూడూరు జడ్పీటీసీ సభ్యుడు మౌలాలి, గ్రామ సర్పంచ్‌ మునిస్వామి గ్రామానికి వచ్చిన నాయకులకు స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం తమ వీధి నుంచి మొదలు పెట్టాలని జడ్పీటీసీ, సర్పంచ్‌ ఇద్దరు పట్టుబట్టారు. ఈ క్రమంలో అభ్యర్థి సతీష్‌, కుడా చైర్మన్‌ కోట్ల హర్ష సమక్షంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఘర్షణ వాతావరణ ఏర్పడింది. ఇరువర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నా యి. అయితే.. గ్రామ సర్పంచ్‌ ముని స్వామి మాటకు విలువ ఇవ్వకుండా జడ్పీటీసీ సభ్యుడు మౌలాలి సూచించిన వీధిలో ప్రచారానికి వైసీపీ అభ్యర్థి సతీష్‌ సహా ఆ పార్టీ నాయకులు వెళ్లారు. ఇష్టమైతే రండి.. లేదంటే వెళ్లిపోండి..! అంటూ సర్పించ్‌ వర్గాన్ని ఉద్దేశించి వైసీపీ నాయకుడు ఒకరు అన్నట్లు సమాచారం. అప్పటికే గ్రామ సర్పంచ్‌గా తాము సూచించిన వీధుల్లో ప్రచారానికి రాలేదనే అవమానంతో రగిలిపోతున్న మునిస్వామి వర్గానికి వైసీపీ నాయకుడి మాటలు మరింత ఆజ్యం పోశాయి. ఆగ్రహంతో రగిలి పోయారు. అప్పటి వరకు చేతబట్టుకొని జేజేలు కొట్టిన వైసీపీ జెండాలను నేల మీద పడేసి కాళ్లతో తొక్కారు. వైసీపీకి, అభ్యర్థి సతీష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ జెండాలను కుప్పగా పోసి అగ్గిపుల్ల గీసేసి నిప్పు పెట్టారు. మంటలు చెలరేగకుండా స్థానిక నాయకులు అడ్డుకొని అగ్గిపుల్లను ఆర్పేశా రు. ఈదే జరగకపోయి ఉంటే వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆగ్రహ జ్వాల కు ఆ పార్టీ జెండాలు కాలిబూడిదయ్యేవని స్థానికులు పేర్కొన్నారు. గూడూరు మండలం వైసీపీలో అభ్యర్థి ప్రచారంలో విభేదాలు భగ్గుమన డం కొసమెరుపు. దీంతో ఆర్‌.ఖానాపురంలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది.

Updated Date - Apr 26 , 2024 | 11:28 PM