సుంకేశ్వరిలో అతిసార
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:11 PM
మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో అతిసార విజృంభించింది.
మూడేళ్ల బాలిక మృతి
70 మందికి అస్వస్థత
కదిలివచ్చిన అధికార యంత్రాంగం
24/7 వైద్యసేవలు అందిస్తామన్న ఇన్‌చార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
మంత్రాలయం, జూలై 15: మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో అతిసార విజృంభించింది. తాగునీరు, అపరిశుభ్రత కారణంగా గత నాలుగు రోజుల నుంచి గ్రామ ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆదోని, ఎమ్మిగనూరు, రాయచూరు వంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున బోయ ఈరన్న, అంజలి దంపతుల కూతురు జ్యోతి (3) అనే చిన్నారి అతిసారతో మృతి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తమై సుంకేశ్వరి గ్రామానికి పరుగులు పెట్టారు. గ్రామ సచివాలయం వద్ద వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇందులో గుడికల్ ముద్దయ్య, తులసి దంపతుల కుమారుడు శివ (2) అనే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గ్రామంలో మురికి కాలువలు చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై మురుగు నీరు చేరడంతో అపరిశుభ్రత నెలకొంది. తాగునీరు పంపింగ్ చేసే బోర్లు కలుషితం కావడంతో అతిసార ప్రబలినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నీటి శాంపుల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఆయా శాఖల అధికారులపై ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతి అనే మూడేళ్ల చిన్నారి అతిసారతో మృతి చెందడం బాధాకరమని అన్నారు. జేసీ, ఆదోని సబ్ కలెక్టర్‌లతో పాటు డీఎంహెచ్‌వో ప్రవీణ్ కుమార్, డీపీవో నాగరాజునాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావులు జ్యోతి తల్లిదండ్రులు ఈరన్న, అంజలిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
సుంకేశ్వరికి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి
మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామానికి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఎంహెచ్‌వో ప్రవీణ్ కుమార్, ఆర్‌డబ్ల్యూ ఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీపీవో నాగరాజునాయుడు, ఆర్‌డబ్య్లూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో బాలమురళికృష్ణ, డీఎల్‌డీవో నాగరాజరావు, డీఎల్‌పీవో నూర్జహాన్, తహసీల్దార్ శ్రీధర్‌మూర్తి, ఈవోఆర్‌డీ ప్రభావతిదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వేదస్వరూప, మండల వైద్యాధికారులు గోవిందమ్మ, సురేష్ సోమవారం చేరుకున్నారు. తాగునీటి వ్యవస్థను, మురికి కాలువలను పరిశీలించారు. శ్మశానం దగ్గర వేసిన బోరు నుంచి తాగునీరు సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. మురికి కాలువలను శుభ్రం చేసి, దోమల నివారణకు హైపోద్రావణాన్ని పిచికారి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో వైద్యసేవలు అందుబాటులోకి రావాలని ఆదేశించారు. వీరి వెంట వీఆర్వో ఆనంద్, కార్యదర్శి చిరంజీవి, సర్పంచ్ ముకురన్న, వైద్యసిబ్బంది ఉన్నారు.
చిన్నారి కుటుంబానికి పరామర్శ
సుంకేశ్వరి గ్రామంలో అతిసారతో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పరామర్శించారు. పరిశుభ్రతపై దృష్టి సారించి ఉచితంగా 24/7 ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలని జేసీ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. పరిస్థితి విషమించే వరకు ఆర్‌డబ్ల్యూఎస్, సర్పంచ్, వైద్యసిబ్బంది ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజులపాటు కంటికి రెప్పల్లా పిల్లలను కాపాడాలని, సచివాలయాన్ని ఏడు రోజులు ఉచిత వైద్యానికి ఉపయోగించుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు 108, 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చి విషమంగా ఉన్న ముద్దయ్య, తులసి దంపతుల కుమారుడు శివకు మెరుగైన వైద్యచికిత్సలు అందించారు.
టీడీపీ నాయకుల పరామర్శ
టీడీపీ నాయకుడు ఎన్. రాఘవేంద్రరెడ్డి గ్రామానికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. అతిసార ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఈయన వెంట నాయకులు రోగెప్ప, నాగప్ప, టీడీపీ ఉన్నారు.
బాలిక మృతిపై మంత్రి భరత్ విచారం
కర్నూలు అర్బన్: సుంకేశ్వరి గ్రామంలో అతిసారతో చిన్నారి జ్యోతి మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ విచారం వ్యక్తం చేశారు. అతిసార ప్రబలడంతో ఎందరో అనారోగ్యానికి గురయ్యారని, అలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అతిసార ప్రబలకుండా గ్రామాల్లో బ్లీచింగ్ చేయడంతో పాటు ప్రజలు శుభ్రం పాటించేందుకు అవసరమైన అవగాహన కల్పించాలన్నారు.