Share News

అభివృద్ధా.. అరాచకమా..?

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:40 AM

విజనరీ ఉన్న చంద్రబాబు కావాలా... అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ కావాలా అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

అభివృద్ధా.. అరాచకమా..?

తేల్చుకునే సమయం ఆసన్నమైంది

సొంత బాబాయిని చంపినవాళ్లను రక్షిస్తున్నది జగనే

తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్‌.. మహిళలకు ఏం మేలు చేస్తాడు

వైసీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు

టీడీపీతోనే ముస్లింల సంక్షేమం

కర్నూలు రోడ్‌షోలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

రోడ్‌షో, బహిరంగ సభకు పోటెత్తిన జనం

అడుగడుగునా బాలయ్యకు జననీరాజనం

కొండారెడ్డి బురుజు సర్కిల్‌లో జై బాలయ్య నినాదాలు

కర్నూలు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి)/కర్నూలు అర్బన్‌ : విజనరీ ఉన్న చంద్రబాబు కావాలా... అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ కావాలా అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఓటు అస్త్రాన్ని సంధించాలని.. ప్రతి ఓటరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా బాలయ్య సోమవారం కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించారు. పూలబజారు, అమ్మవారిశాల, గడియారం ఆసుపత్రి, పెద్ద మార్కెట్‌, పాత బస్టాండు మీదుగా కొండారెడ్డి బురుజు సర్కిల్‌ వరకు రోడ్‌ షో సాగింది. బాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి బాలయ్య నిర్వహించిన రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. రోడ్లన్నీ జనసందడితో కనిపించాయి. ఇళ్లు, మిద్దెలపై నుంచి జనం బాలయ్యకు అభివాదం చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజు సర్కిల్‌కు యాత్ర చేరుకోగానే.. నగరం నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, జనసైనికులు, బీజేపీ కార్యకర్తలతో ఆ ప్రాంతం జనవరదైంది. జై బాలయ్య.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పంచ్‌ డైలాగులు, పదునైన అస్త్రాలతో వైసీపీ ప్రభుత్వం, జగన్‌ విధానాలను ఎండగట్టారు. అభివృద్ధి జరగాలంటే.. చంద్రబాబు రావాలి.. విధ్వంసకర పాలకుడైన జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. బాలయ్య మాట్లాడుతుండగా హోరెత్తిన ఉత్సాహంతో ప్రజలు జోరు పెంచారు.

దళితులపై పెరిగిన దాడులు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని, వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌లో మాస్కు అడిగిన పాపానికి డా.సుధాకర్‌ను పిచ్చోడిని చేసి చంపారని, పెద్దిరెడ్డి అక్రమాలను ప్రశ్నించినందుకు జడ్జి రామకృష్ణను వేధించి అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించారని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన దళితులకు శిరోముండనం చేయించారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరి చేశారని, ఇలా చెప్పుకుంటూ పోతే దళితులపై జరిగిన దాడులు ఎన్నో అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం టీడీపీ ద్వారానే సాధ్యమన్నారు. ఆనాడు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఎస్సీ వర్గీకరణ చేపడతామని తెలిపారు.

టీడీపీ ద్వారానే ముస్లింల అభ్యున్నతి

ముస్లింల అభివృద్ధి కోసం టీడీపీ కట్టుబడి ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. బీసీ-ఈపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. ముస్లింలకు ఎనలేని గౌరవమిచ్చి మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం అందించిన ఘనత టీడీపీది, చంద్రబాబుదేనన్నారు. హైదరాబాదులో, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన గొప్పతనం చంద్రబాబుదే అన్నారు. ముస్లిం యువతులకు పెళ్లి చేస్తే దుల్హన్‌ పథకం కింద రూ.50వేలు ఇస్తే.. జగన్‌ వచ్చి రద్దు చేశారు. రంజాన్‌ తోపాను ఆపే శాడు. ముస్లింలు కూడా గుర్తు పెట్టుకుని మంచి చేసే వారిని గెలిపించాలని ఈ జగన్‌ను ఓడించాలని పేర్కొన్నారు.

సీమ ప్రాజెక్టులకు ఆద్యుడు ఎన్టీఆర్‌

బీడు వారిన రాయలసీమ పల్లెలకు కృష్ణా జలాలు మళ్లించాలనే లక్ష్యంగా ఎన్టీఆర్‌ తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరి నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాయల సీమను సస్యశ్యామలం చేసేందుకు టీడీపీ ప్రాజెక్టులకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందన్నా రు. డ్వాక్రా సంఘాల ద్వారా దేశంలోని విప్లవం తెచ్చి మహిళలకు ఆర్థికంగా చేయూతనందించి టీడీపీ అని గుర్తు చేశారు. రైతుబజార్ల ద్వారా సరికొత్త విప్లవం తీసుకువచ్చిందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు విజన్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కమిట్మెంట్‌తోనే ఎన్డీయే కూటమి ఏర్పడిందని, జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం తథ్యమని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. కేంద్ర సహకారం అవసరమని, అందుకే ఎన్డీయేతో పొత్తు అని వివరించారు. ఈ వైసీపీ దుష్ప్రచారం నమ్మవద్దని గుర్తు చేశారు. బాబాయిని హత్య చేసిన హంతకులకు అండగా నిలుస్తూ తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జగన్‌ మహిళల సంక్షేమానికి ఏమి పాటు పడుతారని అన్నారు. నాడు కోడికత్తి డ్రామాతో నమ్మించిన జగన్‌.. నేడు గులకరాయి డ్రామాకు తెర తీశాడని, జగన్‌ మాయమాటలకు నమ్మి మోసపోవద్దన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌, ఎంపీ అభ్యర్థి నాగరాజులను గెలిపించండి

కర్నూలు నగరం అభివృద్ధి చేయగలిగే సత్తా.. కమిట్మెంట్‌, ఉన్నత లక్ష్యాలు కలిగిన యువకుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌ను, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజులను గెలిపించే బాధ్యత టీడీపీ శ్రేణులతోపాటు జనసైనికులు తీసుకోవాలని బాలకృష్ణ సూచించారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ మనకు ఓటు అనే అస్త్రాన్ని ఇచ్చారని, ఆ అస్త్రాన్ని సరైన మార్గంలో సంధించి నగరం, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే టీడీపీ అభ్యర్థులు, టీడీపీని గెలిపించాలని, రెండు ఓట్లును సైకిల్‌ గుర్తుపై వేయాలని బాలకృష్ణ సూచించారు. కర్నూలు రోడ్‌షోలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు గజమాలలతో సత్కరించారు. కొండారెడ్డి బురుజు సర్కిల్‌లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర సహా పలువురు టీడీపీ నాయకులు శాలువలు, పూలబొకేలు ఇచ్చి అభినందించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:40 AM