Share News

జనసంద్రమైన కోసిగి

ABN , Publish Date - May 23 , 2024 | 11:48 PM

కోసిగయ్య రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కోసిగి జనసంద్రంగా మారింది.

జనసంద్రమైన కోసిగి

కన్నులపండువగా సాగిన కోసిగయ్య రథోత్సవం

మొక్కులు తీర్చుకున్న నూతన దంపతులు

కోసిగి మే 23: కోసిగయ్య రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కోసిగి జనసంద్రంగా మారింది. కోసిగిలోని 3వ వార్డులో వెలసిన ఆంజనేయస్వామి (కోసిగయ్య) స్వామికి రెండు రోజులుగా ప్రత్యేక పూజలు జరిగాయి. అందులో భాగంగా గురువారం ఉదయం నుంచే కోసిగయ్య స్వామికి ఆకుపూజ, నదిజలాలచే అభిషేకాలు, మంగళహారతి వంటి పూజలు చేశారు. అనంతరం పౌర్ణమి పర్వదినం కావడంతో గురువారం సాయంత్రం 5:30 గంటలకు తేరుబజారు మైదానంలో కోసిగయ్య స్వామి రథోత్సవాన్ని అశేష జనవాహిని మద్య కొనసాగించారు. ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి వేర్వేరు సమయాల్లో రథోత్సవానికి పూజలు చేశారు. వీరికి స్థానిక నాయకులు పూలమాలలు, శాలువలతో సన్మానించారు. ఆలయ ఈవో దినేష్‌ కుమార్‌, సుబ్బయ్య ఆచారి, ఆలయ అర్చకులు శ్రీరాములు నేతృత్వంలో ధర్మకర్తల వంశస్థులైన శ్రీనివాసరాజు దొర, మురళి దొర సమక్షంలో పూర్ణకుంభం, కలశాలతో డప్పు వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని కొనసాగించారు. కొత్తగా పెళ్లయిన నూతన దంపతులు జంటగా వచ్చి రథోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోంది. రథోత్సవంలో కొత్తగా పెళ్లయిన జంటలు సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - May 23 , 2024 | 11:48 PM