మంత్రాలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:04 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది.

మంత్రాలయం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. ఏడాది ఆఖరి శని, ఆదివారాలు కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు పండితుల ఆశీస్సులు పొందారు.
అన్నదానానికి విరాళం: రాఘవేంద్రస్వామి మఠంలోని నిత్యాన్నదా నానికి బెంగుళూరుకు చెందిన అచ్యుతరావు అనేభక్తుడు రూ.3లక్షలు, గోశాలకు రూ.2 లక్షలు , విద్యాదానానికి రూ.20 వేలు , అల్వేలు అనేభక్తుడు అన్నదానానికి రూ.50 వేలు విరాళంగా ఇచ్చినట్లు ఏఏవో మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్ జోషి తెలిపారు. శనివారం వేర్వేరు సమయాల్లో కుటుంబ సమేతంగా వారు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. విరాళం ఇచ్చిన దాతల కుటుంబాలకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీపాద ఆచార్, గిరిధర్, అనంతపురాణిక్ తదితరులు పాల్గొన్నారు.