పారదర్శకంగా కౌంటింగ్ జరగాలి
ABN , Publish Date - May 26 , 2024 | 11:28 PM
ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కౌంటింగ్‌ను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సిబ్బందికి సూచించారు.
జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు
సిబ్బందికి శిక్షణ
నంద్యాల (నూనెపల్లె), మే 26: ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కౌంటింగ్‌ను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సిబ్బందికి సూచించారు. నంద్యాలలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించి పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు సంపూర్ణ శిక్షణ ద్వారా అవగాహన పెంచుకోవాలని సూచించారు. నంద్యాల పార్లమెంట్‌తో పాటు ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్ళు, కౌంటింగ్ విధులు నిర్వహించేందుకు మొదటి, ర్యాండమైజేషన్‌లో కౌంటింగ్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. కౌంటింగ్ సమయంలో రౌండ్ల వారీగా వివరాలను ఏజంట్లకు విన పడేలా కౌంటింగ్ సిబ్బంది చదవాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు కూడా సదరు వివరాలను నమోదు చేసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఖచ్చితంగా కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటలకే ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాళ్లకు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.