Share News

గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌

ABN , Publish Date - May 22 , 2024 | 12:04 AM

నంద్యాల పట్టణంలోని త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ కవాతు నిర్వహించినట్లు సీఐ నరసింహులు తెలిపారు.

గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌
జిల్లెల్ల గ్రామంలో ప్రజలతో మాట్లాడుతున్న పోలీసులు

నంద్యాల క్రైం, మే 21: నంద్యాల పట్టణంలోని త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ కవాతు నిర్వహించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. దేవనగర్‌, వీసీ కాలనీ, రాయల్‌ కాంపౌండ్‌, కరుణామయ స్కూల్‌, దేవనగర్‌ పార్క్‌రోడ్‌, టీచర్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీస్‌ కవాతు నిర్వహించామని చెప్పారు. సీఐ మాట్లాడుతూ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా మొత్తం 30-పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని తెలిపారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉందని, వారికి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చామని చెప్పారు. అకస్మాత్తుగా రౌడీషీటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేశామన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు నవీన్‌కుమార్‌, నాగరాజు, ధనమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

పాణ్యం: మండలంలోని సుగాలిమెట్ట గ్రామంలో మంగళవారం పాణ్యం సీఐ నల్లప్ప ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేని ఆరు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలతో గ్రామాలలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాలలో కార్డన్‌ సర్చ్‌ ద్వారా గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు, ఎన్నికల కోడ్‌ ఉండడంతో కౌంటింగ్‌ కేంద్రాల ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అశోక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పగిడ్యాల: మండలంలోని ప్రాతకోట గ్రామంలో నందికొట్కూరు సీఐ విజయబాస్కర్‌ ఆధ్వర్యంలో మంగళవారం కవాతు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో వైసీపీ , టీడీపీ నాయకుల మధ్య తలెత్తిన వివాదాలను దృష్టిలో ఉంచుకొని కౌటింగ్‌ జరిగే వరకు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట పోలీసులు కవాతు నిర్వహించి గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు జయశేఖర్‌, లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

గోస్పాడు: ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ఒకరినొక్కరు రెచ్చగొట్టుకునే విధంగా ప్రవర్తించకుండా శాంతియుతంగా మెలగాలని సీఐ శివకుమార్‌రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లెల్ల గ్రామంలో గోస్పాడు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, బండిఆత్మకూరు ఎస్‌ఐ మల్లికార్జున, మహానంది ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌తో కలిసి ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు పేల్చడం, ఈలలు, కేకలు వేయకుండా ప్రశాంతంగా ఉండాలని అన్నారు.

ఆత్మకూరురూరల్‌: మండలంలోని సిద్ధాపురం గ్రామంలో మంగళవారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే గ్రామ శివార్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 5 మోటర్‌ సైకిళ్లను సీజ్‌ చేసినట్లు సీఐ నాగభూషణ్‌ తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు ఎస్‌ఐలు వెంకటనారాయణ రెడ్డి, హరిప్రసాద్‌, అశోక్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:04 AM