కంప్యూటరీకరణ సగమే
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:05 AM
సహకార సంఘాల్లో రైతులకు అందిస్తున్న రుణాల పంపిణీలో అక్రమాలను నియంత్రించేందుకు దశాబ్ద కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంప్యూటరీకరించాలని ఆలోచిస్తున్నాయి.
తమవల్ల కాదంటూ తెగేసి చెబుతున్న సంఘాల సీఈవోలు
ఖర్చులు మాత్రం తడిసి మోపెడు..
ఒక్క రూపాయి ఇవ్వలేమంటున్న అధికారులు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 లక్షల మంది రైతుల ఎదురు చూపు
సహకార సంఘాల్లో రైతులకు అందిస్తున్న రుణాల పంపిణీలో అక్రమాలను నియంత్రించేందుకు దశాబ్ద కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంప్యూటరీకరించాలని ఆలోచిస్తున్నాయి. ఇది పూర్తయితే.. తమ ఆటలు సాగవని ఒక్క రూపాయి కూడా జేబులో వేసుకునే అవకాశం ఉండదని సహకార సంఘాల చైర్మన్లతో పాటు వారికి అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు కంప్యూటరీకరణకు ఎప్పటికప్పుడు మోకాలడ్డుతూ వస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 2 నాటికి కంప్యూటరీకరణ చేపట్టాలని, తమ వాటాగా దాదాపు రూ.1,500 కోట్లను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ.600 కోట్లను అందిస్తుందని అధికారులు తెలిపారు. అయినా సహకార సంఘాల్లో అక్టోబరు 10వ తేదీ గడిచిపోయినా కంప్యూటరీకరణ మాత్రం పూర్తి కాలేదు. 99 సహకార సంఘాల్లో ఇప్పటికీ 50 శాతం వివరాలు మాత్రమే కంప్యూటరీకరణ జరిగినట్లు జిల్లా సహకార కేంద్రబ్యాంకు సీఈవో విజయకుమార్ తెలిపారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవని రాజకీయ నాయకులను కాదని తాము కంప్యూటరీకరణ ఇప్పటికిప్పుడు పూర్తి చేయలేమని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సీఈవోలు స్పష్టం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయలేమని, సంఘాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా రుణాలు తీసుకున్న రైతుల వివరాలన్నీ కంప్యూటర్‌లో నమోదు చేయాలంటే కష్టసాధ్యమని వారు చెబుతున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో సంఘాల కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టింది. దీని కోసం రూ.2వేల కోట్లకు పైగానే నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు ఆరున్నర లక్షల మంది రైతులు సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటి దాకా ఏటా రూ.100 నుంచి రూ.200 కోట్ల దాకా పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు రైతులకు అందిస్తూ వచ్చారు. ఈ రుణాల మంజూరు, వసూళ్లు ఇప్పటి దాకా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే లావాదేవీలు జరుపుతుండటంతో రాజకీయ నాయకులు ఆడింది ఆట.. పాడింది పాటగా కొనసాగుతూ వస్తున్నది. వారి పుణ్యమా అని ఎంతో మంది సంఘాల్లోని సీఈవోలు బలిపశువులుగా మారారు. కేంద్ర సహకార బ్యాంకు అధికారులు కూడా సస్పెండ్ అయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం అక్టోబరు 2 నాటికి సహకార సంఘాల్లో కంప్యూటరీకరణను పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. అక్టోబరు 10వ తేదీ వచ్చినా కూడా వివిధ కారణాలు ఎత్తి చూపుతూ సహకార సంఘాల్లో సీఈవోలు 40 నుంచి 50 శాతం మాత్రమే కంప్యూటరీకరణ పూర్తి చేశారు. మిగిలిన పని పూర్తి కావాలంటే ప్రభుత్వం గడువు పెంచక తప్పదని ఆయా సహకార సంఘాల సీఈవోలు స్పష్టం చేస్తున్నారు.
రేయింబవళ్లు పని చేస్తున్నా, ఖర్చులు తడిసి మోపెడవుతున్నా.. తమ కష్టాన్ని జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సంఘాల సీఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం లేదా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు కంప్యూటరీకరణకు ఏ మాత్రం నిధులు సరిపడ ఇవ్వడం లేదని, దీంతో తమ జీతాల నుంచి ఖర్చులు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబందించి ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాలకు పంట రుణాల కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.15 కోట్లను విడుదల చేసింది. ఒక్కో సంఘానికి పొలాలు ఉన్న రైతులకు రూ.10 లక్షలు, కౌలు రైతులకు రూ.15 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఇప్పటికీ ఖరీఫ్ ఇచ్చిన గడువు ముగిసిపోయినా ఏ సహకార సంఘాల్లో కూడా ఒక్క రూపాయిని రైతులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొన్ని సహకార సంఘాల పరిధిలో రాజకీయ నాయకులు, వారి అనుచరులు కంప్యూటరీకరణను పక్కన పెట్టేసి రైతులకు రుణాలు ఇవ్వాలని సంఘాల సీఈవోలపై ఒంటికాలిపై లేస్తున్నారు.
ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. సీఈవోల ఆవేదన
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సహకార సంఘాలు ఏర్పడి దాదాపు దశాబ్దాల కాలం పూర్తయింది. అన్ని సంఘాల్లో కలిపి ఆరున్నర లక్షల మంది రైతులు ఇప్పటిదాకా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించారు. ఈ వివరాలన్నీ కంప్యూటరీకరణలో భాగంగా నమోదు చేయాలంటే తల ప్రాణం తోకకు వస్తోందని సీఈవోలు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదనపు సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నా కంప్యూటరీకరణ పూర్తి కావడం లేదని, ఇప్పటికే ఒక్కో సహకార సంఘానికి ఖర్చు రూ.50వేల నుంచి రూ.లక్ష దాకా వచ్చిందని, ఈ మొత్తాన్ని సహకార బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళితే.. ఒక్క రూపాయి కూడా చెల్లించలేమని మీ చావు మీరు చావండని చెబుతుండటంతో సంఘాల సీఈవోలు లబోదిబోమంటున్నారు.
ఖరీఫ్ రుణాలు లేనట్లే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు కోసం రూ.15 కోట్లను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కేటాయించింది. అయితే.. ఈ రుణాలను ఇప్పటి దాకా అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.5లకు పైగానే వడ్డీతో వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటున్నామని, పంటలు సక్రమంగా చేతికి అందితేనే ఈ అప్పులను తీర్చగలుగుతామని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు గాని, సహకార సంఘాల సీఈవోలు గాని తమ ఆర్తనాదాలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం సహకార బ్యాంకు అధికారుల నత్తనడకనే ఈ పరిస్థితికి కారణమని రైతులు ధ్వజమెత్తుతున్నారు.
సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తయితే.. రాజకీయ నాయకుల అక్రమాలకు తెరపడినట్లే. ఇప్పటి దాకా గ్రామాల్లో సహకార సంఘాల్లో కార్యకలాపాలు నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. రైతులకు రుణం కావాలంటే ఖచ్చితంగా వారి చేతులు తడపాల్సిందే. ఇప్పటిదాకా సహకార సంఘాల్లో రుణం కావాలంటే రైతులు తప్పనిసరిగా రాజకీయ నాయకులు సంఘాల్లోని సీఈవోలు సిబ్బంది చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. కంప్యూటరీకరణతో ఈ అక్రమాలకు దాదాపు 90 శాతం చెక్ పడే అవకాశం ఉందని సహకార కేంద్ర బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ కంప్యూటరీకరణ రాజకీయ నాయకులు మోకాలొడ్డుతుండటం వల్లే పూర్తి కాని పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. కర్నూలు, పత్తికొండ, డోన్, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, ఆలూరు, ఆదోని తదితర ప్రాంతాల్లో రాజకీయ నాయకుల ఒత్తిడితో బోగస్ రైతుల పేరు మీద పాసు పుస్తకాలు తయారు చేసి రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని బకాయిలు ఎగవేసిన కారణంగా దాదాపు 40 శాతం సహకార సంఘాలు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎంతో మంది సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని మేనేజర్లు, సూపర్ వైజర్లు అదే విధంగా సంఘాల్లోని సీఈవోలు ఉద్యోగాలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఓర్వకల్లు మండలంలోని నన్నూరులో ఇటీవలె ఆ సంఘంలో పని చేస్తున్న సీఈవో రాజకీయ నాయకుల ఒత్తిడితో ఎరువుల పంపిణీకి సంబంధించి అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆలూరు సహకార బ్యాంకు పరిధిలో చనిపోయిన ఓ రైతుకు రుణాన్ని మంజూరు చేసి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఆదోని, క్రిష్ణగిరి, డోన్, కర్నూలులోని కృస్ణానగర్ బ్రాంచ్ పరిధిలో కూడా ఇవే పరిస్థితులు తలెత్తాయి. ఈ దారుణాలకు చెక్‌పెట్టాలంటే కంప్యూటరీకరణ తప్ప మరో మార్గం లేదు. దశాబ్దాల నుంచి నిద్రావస్తను వీడి ఇప్పుడిప్పుడే కంప్యూటరీకరణ చేపట్టిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆపసోపాలు ఎదుర్కొంటోంది.
నాయకుల అక్రమాలు బయటపడుతాయనే...
ఎప్పుడో సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తి కావాల్సింది. రాజకీయ నాయకులు తమ అక్రమాలు ఎక్కడ వెలుగు చూస్తాయోనన్న భయంతో కంప్యూటరీకరణను అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిపేందుకు కంప్యూటీకరణ పనులను వేగవంతం చేసి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
- జగన్నాథం, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి