Share News

మహానందిలో చిరుత

ABN , Publish Date - Jul 11 , 2024 | 11:17 PM

మహానంది ఆలయం ఎదుట బుధవారం అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది. తిరిగి గురువారం రాత్రి 8 గంటల సమయంలో చిరుత జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు.

మహానందిలో చిరుత

ఈసారి ఆలయం ఎదుటే సంచారం

కుక్కను నోట కరుచుకుని వెళ్లిన చిరుతపులి

భయంతో పరుగులు తీసిన భక్తులు

మహానంది, జూలై 11: మహానంది ఆలయం ఎదుట బుధవారం అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది. తిరిగి గురువారం రాత్రి 8 గంటల సమయంలో చిరుత జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. దైవదర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయ పరిసరాల్లో విశ్రాంతి తీసుకుంటున్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. గత వారం రోజుల నుంచి నల్లమల అడవి నుంచి వచ్చిన చిరుతపులి క్షేత్రపరిసరాల్లోనే తిరుగుతోంది. బుధవారం అర్ధరాత్రి ఆలయ ఎదుట భాగంలో పున్నమి అతిథి గృహానికి అతి సమీపంలో ఓ కుక్కను చిరుతపులి నోట కరుచుకుని తిరిగి అడవిలోకి వెళ్తున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. తిరిగి గురువారం రాత్రి 8 గంటల సమయంలో అదే చిరుత ఈశ్వర్‌నగర్‌ కాలనీలోకి ప్రవేశించింది. అక్కడ మరో కుక్కను నోటితో కరుచుకుని లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంతవరకు దేవస్థానం గోశాల, పరిసరాల్లోని ఈశ్వర్‌నగర్‌ కాలనీ, ఉద్యోగుల కాలనీ, పార్వతీపురం సమీపంలో సంచరించిన చిరుత ఈ దఫా ఏకంగా మహానంది ఆలయం ముందు భాగంలోకి రావడంతో భక్తులకు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల క్రితం ఈశ్వర్‌నగర్‌ కాలనీకి చెందిన గిరిజన బాలుడు నాగన్నపై కూడా చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. అప్రమత్తమైన ఆలయ, అటవీ శాఖ అధికారులు మైకుల ద్వారా పులి సంచారంపై ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

బంధించేందుకు సిద్ధమైన అధికారులు

చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఎన్‌ఎస్‌టీఆర్‌(నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌) అధికారుల నుంచి అనుమతులు రాగానే పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత కదలికలను అటవీశాఖ అదికారులు గుర్తించారు. అనుమతులు వచ్చిన వెంటనే చిరుతను బంధించేందుకు రెండు బోన్లను కూడా సిద్ధం చేశారు.

Updated Date - Jul 11 , 2024 | 11:17 PM