Share News

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:30 PM

రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వారం రోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు
పెంచికలపాడు వద్ద పత్తి కొనుగోలు కేంద్రం

వారంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వారం రోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రైతులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అక్రమాలు జరుగుతున్నాయనీ వీటిని అరికట్టేందుకు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో అంశాలపై ఏకీభవిస్తూ హైకోర్టు జడ్జీలు శనివారం సీసీ కెమెరాల ఏర్పాటు కు ఆదేశాలు జారీ చేయడంతో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 12 కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడంలో అధికారులు వివిధ మార్గాల్లో నిర్లక్ష్యం చూపుతున్నారని, పత్తి తూకాల్లో తేడా వస్తోందని, ఆ కేంద్రాల వద్ద దళారులు, వ్యాపారులే ఎక్కువగా తిష్ఠ వేసి పత్తి కొనుగోళ్లను తక్కువ ధరకు వారే నిర్వహిస్తున్నారని రైతులు హైకోర్టుకు విన్నవించారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు తమకు ఇంకా రాలేదని, ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు అందిన వెంటనే సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 11:30 PM