Share News

రూ.1.84 కోట్ల నగదు పట్టివేత

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:56 PM

పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా నగదు రూ.1,84,53,500 నగదు, 4.232 కేజీల బంగారు, ఐదు కేజీల వెండి పట్టుబడ్డాయి

రూ.1.84 కోట్ల నగదు పట్టివేత

4.232 కేజీల బంగారు, ఐదు కేజీల వెండి కూడా..

వెల్దుర్తి, ఫిబ్రవరి 2: పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా నగదు రూ.1,84,53,500 నగదు, 4.232 కేజీల బంగారు, ఐదు కేజీల వెండి పట్టుబడ్డాయి. గురువారం రాత్రి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఖాజాహుసేన్‌కు సమాచారం రావడంతో హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న ఎన్‌ఎల్‌ 01 ఎమ్‌ 2506 నెంబరుగల ప్రైవేట్‌ స్లీపర్‌ ఏసీ ట్రావెల్స్‌ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు. అందులో ప్రయాణిస్తున్న అమర్‌ ప్రతాప్‌ (నంద్యాల) నుంచి రూ.1.20 కోట్ల నగదు, వెంకటేష్‌ (కోయంబత్తూరు) నుంచి 3కేజీల195 గ్రాముల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌ కుమార్‌ (కోయంబత్తూరు) నుంచి కేజీ 37 గ్రాముల బంగారం, రూ.44 లక్షల 50 వేల నగదు, శబరి రాజన్‌ (సేలం) నుంచి 5 కేజీల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పట్టుబడిన బంగారం, వెండి, నగదు విలువ రూ.4,59,08,300. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మస్తాన్‌వలి సమక్షంలో పంచనామా నిర్వహించి విజయవాడ ఆదాయపు పన్నుశాఖకు తెలియజేశారు. ఎలాంటి పత్రాలు లేని 5 కేజీల వెండి, 4 కేజీల232 గ్రాముల బంగారు, రూ.1,84,53,500 నగదు సీజ్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఎస్పీ కృష్ణకాంత్‌ సెట్‌ కాన్ఫరెన్స్‌లో ఎస్‌బీ ఖాజాహుసేన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వాహన తనిఖీల్లో వెల్దుర్తి సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:56 PM