Share News

అన్న క్యాంటీన్లు వచ్చేస్తున్నాయ్‌..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:03 AM

రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధ్దరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగో సంతకం చేశారు.

అన్న క్యాంటీన్లు వచ్చేస్తున్నాయ్‌..!

ఫైల్‌పై సంతకం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

గతంలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో ఏర్పాటు

అఽధికారంలోకి రాగానే రద్దు చేసిన జగన్‌

మళ్లీ పునరుద్ధరించిన టీడీపీ ప్రభుత్వం

జిల్లాలో లక్షలాది పేదలకు ఉపయోగం

సామాన్యుల్లో వెల్లివిరుస్తున్న సంతోషం

కర్నూలు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధ్దరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. పేదల ఆకలి తీర్చే మంచి పనికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే సామాన్యులు, పట్టణాల్లో ఉండే పేదలకు రూ.5కే టిఫిన్‌, భోజనం అందించాలనే మహోన్నత ఆశయంతో గత తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే జిల్లాలో కర్నూలు నగరంలో కలెక్టరేట్‌, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, పూల బాజారులో ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌ వద్ద, శ్రీనివాస్‌ థియేటర్‌ దగ్గర, ఆదోనిలో ప్రభుత్వ స్త్రీలు, చిన్నపిల్లల ఆస్పత్రి ఆవరణలో, పాత బస్టాండ్‌ సమీపంలో, పోస్టాఫీసు దగ్గర మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు వచ్చే వారికి, సొంత అవసరాల కోసం పట్టణాలకు వచ్చే వారికి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుల్లో కూడా క్యాంటీన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి రోజు ఒక్కో అన్న క్యాంటీన్‌లో సగటున 750 నుంచి వెయ్యి మందికిపైగా ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం చేసేవారు. ఈ లెక్కన కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోనిలో రోజుకు 8 వేల నుంచి 10 వేలు చొప్పున పేదల ఆకలి తీరేది. ఎందరో పేదలనను అన్నపూర్ణగా అన్న క్యాంటీన్లు ఆదరించాయి.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు పేరు మీద టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూన్‌ 11న ఏర్పాటు చేసింది. అన్న క్యాంటీన్ల కోసం అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రోజుకు దాదాపు 2.25 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఆకలి తీర్చిన క్యాంటీన్‌ అన్న క్యాంటీన్లు నిలిచిపోయాయి. ఒక్క క్యాంటీన్‌లో ఉదయం 300 మంది, రాత్రి 250 మందికి ప్రతి రోజు రూ.5లకు నాణ్యమైన భోజనం అందించేవారు. అయితే 2019 మే 30న జగన్‌ ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లు వల్ల చంద్రబాబుకు పేరు వస్తుందనే కసితో వీటికి తాళం వేశారు. పేదల కడుపుకొట్టారు. అన్న క్యాంటీన్లను సచివాలయాలుగా మార్చారు. కర్నూలు సర్వజన వైద్యశాలతో నిర్మించిన అన్న క్యాంటీన్‌ భవనం నిరుపయోగంగా మార్చారు. గురువారం చంద్రబాబు ఒక్క సంతకంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధ్దరించడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీకి అంత వణుకెందుకు..?

2019 ఆగస్టు 1న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మూసివేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. పేదవారికి పట్టడన్నం పెట్టడాన్ని మాజీ సీఎం జగన్‌ రెడ్డి ఓర్చుకోలేకపోయాడు. అంతటితో ఆగకుండా అన్నం పెట్టే నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పట్టించుకోలేదు. దీంతో అన్న క్యాంటీన్లను కొనసాగించాలని డిమాండ్‌ పేదవారి నుంచి గట్టిగా వినిపించింది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ ముద్ర అన్న క్యాంటీన్లపై ఉండటంతో జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రం సహించలేకపోయింది. అన్న క్యాంటీన్ల భవనాల రంగులు కూడా మార్చేసింది.

క్యాంటీన్లు ప్రారంభించడం అభినందనీయం

ఎంతో మంది నిరుపేదలు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రారంభించడం అభినందనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి పనుల నిమిత్తం వస్తే, అన్న క్యాంటీన్‌లో భోజనం చేసి, ఆకలి తీర్చుకునేవాళ్లం. బయట రూ.70-రూ.100 పెట్టి భోజనం చేయాలంటే కష్టం. మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంటీన్లు ప్రారంభించడం సంతోషం.

- నరసయ్య, పెద్దతుంబళం గ్రామం

చాలా మంచి నిర్ణయం

అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించటం చాలా మంచి నిర్ణయం. గతంలో జగన్‌ అన్న క్యాంటీన్ల గురించి తెలుసుకోకుండా గడ్డిగా మూసేయించారు. అది సరైంది కాదు. ఎంతో మంది పేదలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు అన్న క్యాంటీన్లలో కడుపు నింపుకునేవారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే తిరిగి క్యాంటీన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.

- వీరయ్య, చిరువ్యాపారి, ఎమ్మిగనూరు

పేదల కడుపు నింపుతాయి

ఎంతో మంది పేదల కడుపులు నింపే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నారంటే అనందంగా ఉంది. ఇది ఎంతో మంచి నిర్ణయం. చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగించేవారు ఆకలితో పడుకోకుండా అన్న క్యాంటీన్లలో కడుపు నింపుకుంటారు. పేదల ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయిం తీసుకోవటం హర్షణీయం.

- శ్రీనివాసులు, ఆటో డ్రైవర్‌, కోటేకల్‌

Updated Date - Jun 17 , 2024 | 12:03 AM