Share News

సైకిల్‌ ఎక్కనున్న బైరెడ్డి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:13 AM

సైకిల్‌ ఎక్కనున్న బైరెడ్డి

సైకిల్‌ ఎక్కనున్న బైరెడ్డి

టీడీపీలో చేరేందుకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిద్ధం

ఈ నెల 7 తర్వాత ముహూర్తం ఖరారు

బైరెడ్డి కుమార్తె శబరికి ఎంపీ టికెట్‌?

ఎమ్మెల్యే టికెట్‌నూ ఆశిస్తున్న రాజశేఖర్‌ రెడ్డి

నంద్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి)/నందికొట్కూరు: మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే చంద్రబాబును కలిసి పార్టీలో ఆయన చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డికి సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయకుడిగానే కాకుండా, బలమైన నేతగా పేరుంది. మొదట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బైరెడ్డి, 2009 అనంతర పరిణామాలతో పార్టీని వీడారు. ఆ తర్వాత ప్రత్యేక రాయలసీమ వాదాన్ని తనదైన శైలిలో బలంగా వినిపించారు. అయితే ప్రస్తుతం ఆయన మళ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తాను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన టీడీపీ నుంచే టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు ఆ పార్టీ పెద్దలతో చర్చలు పూర్తయ్యాయని, ఆయన ఇంట్లో ఒకరికి ఎంపీ టికెట్‌ ఖాయమైందని సమాచారం. అయితే బైరెడ్డి మాత్రం నంద్యాల ఎంపీ టికెట్‌తో పాటు, ఒక ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బైరెడ్డి చేరిక జిల్లాలో టీడీపీకి కొత్త ఊపు తీసుకురానుండగా, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో బలం పెరగనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎంపీ ఓకే.. ఎమ్మెల్యే టికెట్‌పైనే డౌట్‌!

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సొంత గ్రామం నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామం. ఆయన తండ్రి శేషశయనారెడ్డి నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. తండ్రి రాజకీయాన్ని అందిపుచ్చుకున్న రాజశేఖరరెడ్డి అదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడుగా మారడంతో 2009లో పాణ్యం నుంచి బరిలోనికి దిగి ఓడిపోయారు. ఈ రెండు నియోజకవర్గాల్లో బైరెడ్డికి మంచి పట్టుంది. తన చేరిక పార్టీకి బలం పెరుగుతుంది కాబట్టి తన కుటుంబానికి ఓ ఎంపీ టికెట్‌, ఓ ఎమ్మెల్యే టికెట్‌ కావాలని బైరెడ్డి టీడీపీ పెద్దలను పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ టికెట్‌ వరకు టీడీపీ సరే అన్నట్లు తెలుస్తోంది. అది కూడా రాజశేఖరరెడ్డి కుమార్తె బైరెడ్డి శబరికి అయితేనే ఓకే అన్నట్లు సమాచారం. చివరకు టీడీపీ, రాజశేఖరరెడ్డి మధ్య అవగాహన వచ్చిందని, ఇక ఆయన పార్టీలో చేరిక లాంఛనమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. టీడీపీలో చేరిన తర్వాత కర్నూలులో భారీ బహిరంగ సభను బైరెడ్డి ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన మొదటిసారి ఎన్టీఆర్‌ సమక్షంలో టీడీపీలో చేరినపుడు కూడా ఇదే విధంగా చేశారు. ప్రస్తుతం కూడా అదే విధానాన్ని పాటించబోతున్నట్లు సమాచారం.

Updated Date - Feb 07 , 2024 | 12:13 AM