Share News

బైబై వైసీపీ

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:10 AM

బైబై వైసీపీ

బైబై వైసీపీ

అంచనాలు పటాపంచలు

ఊహాగానాలకు తెరదింపుతూ ఫలితాలు

జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయిన సైకిల్‌

రెక్కలు ముక్కలై విరిగిపడిన ఫ్యాన్‌

రెండు మినహా అన్ని స్థానాలు కైవసంపై హర్షాతిరేకాలు

సైకిల్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. దాదాపుగా అన్ని స్థానాల్లో పసుపు జెండా రెపరెపలాడగా టీడీపీ ప్రభంజనం ముందు వైసీపీ గిలగిలా కొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ గెలుపు పవనాలు అందుకోగా వైసీపీకి విపరీతమైన ఎదురుగాలి వీచింది. చివరకు ఫ్యాన్‌ రెక్కలు తుత్తునకలై విరిగి పడ్డాయి. 2019 ఎన్నికల ఫలితాలను తిరగరాస్తూ టీడీపీ విజయబావుటా ఎగుర వేయడంతో సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలతో సహా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్‌ జరిగింది. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య పోరు సాగింది. దాదాపు రెండు నెలలపాటు ఈ రెండు పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీ నడిచింది. చివరకు మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ అద్భుత ఫలితాలను సాధించి వైసీపీ అంచనాలను పటా పంచలు చేసింది. మంత్రాలయం, ఆలూరు మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపును సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా 14 స్థానాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. అధికారం మాటున రెచ్చిపోయిన వైసీపీ నాయకులకు ఈ ఫలితం చెంప పెట్టులా నిలిచిందని, ప్రజాస్వామ్యంలో నియంతలు మట్టికొట్టుకు పోవాల్సిందేనని, అరాచక పాలన అంతం కావాల్సిందే అన్నట్టుగా ప్రజలు తీర్పు ఇచ్చారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

కర్నూలు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామి సృష్టించింది. కందనవోలు గడ్డపై టీడీపీ చారిత్రాత్మక విజయం అందుకుంది. నవ్యాంధ్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయకత్వం కావాలని జనాలు భావించారు.. ఈ మేరకు మే 13న ఓటర్లు టీడీపీ కూటమికి అనుకూలంగా ఏక పక్ష తీర్పు ఇచ్చారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరిగితే ఫలితాలన్నీ దాదాపుగా టీడీపీకే అనుకూలంగా వచ్చాయి. కర్నూలు పార్లమెంట్‌ స్థానంతోపాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

చారిత్రక విజయం: 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభజనం ఉన్నా ఆరు అసెంబ్లీలోనే విజయం సాధించారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ ప్రభుత్వం భర్తరఫ్‌ చేయడంతో 1985లో జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో టీడీపీ గెలిచింది. 1989లో నాలుగు స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 1994లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు, 1999లో నాటి సీఎం చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం దక్కించుకున్నారు. 2004 ఎన్నికల్లో ఆనాటి పీసీసీ అధ్యక్షుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ప్రభంజనం వల్ల ఒకే ఒక స్థానం పత్తికొండలో టీడీపీ గెలిచింది. 2009లో నాలుగు స్థానాలు మాత్రమే దక్కించుకుంటే.. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా దక్కించుకోలేకపోయింది. అంటే.. 1999 ఎన్నికల్లో మినహా టీడీపీ సింగిల్‌ డిజిట్‌ విజయమే అందుకుంది. టీడీపీ ఆవిర్భావించిన తరువాత 42 ఏళ్ల చరిత్రలో 10 పర్యాయాలు ఎన్నికలు జరిగితే ప్రప్రథమంగా కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

ఓట్లు రాల్చని నవరత్నాలు

ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నవరత్నాలే అస్త్రంగా ప్రచారం సాగించారు. అయితే.. ఒక్క చాన్స్‌ అని అధికారం ఇస్తే విధ్వంస పాలన సాగించావంటూ ఓటర్లు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అదే క్రమంలో 2014లో మూడు స్థానాల్లో టీడీపీని గెలిపించినా.. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పలు పరిశ్రమలు తీసుకొచ్చాడు. ముచ్చుమర్రి ప్రాజెక్టు, ఆవుకు టన్నెల్‌ పూర్తి చేశారు. రూ.13,50 కోట్లతో హంద్రీనీవా విస్తరణ, రూ.10 వేల కోట్లతో గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు చేపడితే జగన్‌ వచ్చాక ఆపేశారు. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా శిథిలావస్థకు చేర్చారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నో. ఇవన్నీ నిశితంగా గమనిస్తూ వచ్చిన ప్రజలు ఓటుతో తమ కసి తీర్చుకున్నారు. ఆదుకుంటాయనుకున్న నవరత్నాలు ఓట్లు రాల్చకపోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి.

విజయం అందించిన యువగళం.. ప్రజాగళం

ఉమ్మడి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండు ఎంపీలు, 14 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్‌స్వీప్‌ విజయం సాధించిన వైసీపీ బలమైన పార్టీగా ఎదిగింది. టీడీపీ జిల్లాలో పుంజుకోవడం కష్టమే అన్నవారు లేకపోలేదు. దీనికి తోడు అధికార మాటున వైసీపీ నాయకులు సాగించిన దౌర్జన్యాలకు టీడీపీ శ్రేణులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఆ సమయంలో యువనేత నారా లోకేశ్‌ యువగళం పేరిట సాగించిన పాదయాత్ర టీడీపీ శ్రేణల్లో ఉత్సాహం నింపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బాదుడే.. బాదుడు, ప్రజాగళం పేరిట జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. లక్షలాది జనంతో మమేకమయ్యారు. అలాగే బాబును అరెస్టును ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండారెడ్డి బురుజుపై పుసుపు జెండా రెపరెపలాడింది.

Updated Date - Jun 05 , 2024 | 12:10 AM