బాబు పట్టాభిషేక మహోత్సవంలో తమ్ముళ్ల జోష్
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:59 PM
విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద బుధవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టాభిషేక మహోత్సవానికి జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అదే క్రమంలో టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు ఆయన తల్లిదండ్రులు టీజీ వెంకటేశ్, టీజీ రాజ్యలక్ష్మి, భార్య టీజీ శిల్ప కూతురు, కొడుకు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు
కర్నూలు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద బుధవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టాభిషేక మహోత్సవానికి జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అదే క్రమంలో టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు ఆయన తల్లిదండ్రులు టీజీ వెంకటేశ్, టీజీ రాజ్యలక్ష్మి, భార్య టీజీ శిల్ప కూతురు, కొడుకు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరు మాజీ ఇన్‌చార్జి విష్ణువర్దన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జి కే. మీనాక్షినాయుడు, ఆలూరు, మంత్రాలయం టీడీపీ నాయకులు వీరభద్రగౌడు, ఎన్. రాఘవేంద్రరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవ సభలో సందడి చేశారు. అదే క్రమంలో జిల్లాలో బాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుని బాణసంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు.
సునయన ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారం
కర్నూలు కలెక్టరేట్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలను కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలెక్టర్ జి.సృజన వీక్షించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఏడు చోట్ల జిల్లా యంత్రాంగం ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో మధుసూదన్‌రావు ఇతర జిల్లా అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఏడీ జయమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, హౌసింగ్ పీడీ సిద్దలింగమూర్తి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, కర్నూలు ఆర్డీవో సీఈవో శేషిరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.