Share News

భక్తిపారవశ్యం... చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:55 PM

జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న నందవరం చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

భక్తిపారవశ్యం... చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం

400లకు పైగా జ్యోతులతో అమ్మవారికి నివేదన

జనసంద్రమైన నందవరం

బనగానపల్లె రూరల్‌, ఏప్రిల్‌ 13: జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న నందవరం చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా శనివారం జ్యోతుల ఉత్సవం అశేష భక్తజన సందోహం నడుమ కన్నులపండువగా సాగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. దాదాపు 400లకు పైగా జ్యోతులను భక్తులు అమ్మవారికి నివేదనగా సమర్పించారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ జి.కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భాస్కరయ్యాచారిచే అమ్మవారికి దిష్టిచుక్క పెట్టే వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రి 2 గంటలకు చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి జ్యోతి మహోత్సవం ప్రారంభమైంది. తోగటవీర క్షత్రియులు అమ్మవారి జ్యోతులను తలపై పెట్టుకుని నృత్యం చేస్తూ, అమ్మవారిని స్మరిస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ఎదుట ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో నడిచి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి జ్యోతులను సమర్పించారు. అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైన జ్యోతుల ఊరేగింపు శనివారం ఉదయం 9గంటల వరకు సాగింది. చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవానికి వచ్చిన భక్తులు ఆలయ అధికారులు వసతులను కల్పించారు. నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె రూరల్‌ సీఐ తిమ్మారెడ్డి, పట్టణ సీఐ గంటా సుబ్బారావు, నందివర్గం ఎస్‌ఐ తిరుపాలు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

రమణీయం.. రథోత్సవం

ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నందవరం గ్రామంలో నిర్వహించిన చౌడేశ్వరీదేవి రథోత్సవం రమణీయంగా సాగింది. గ్రామ ఊరి వాకిలి వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన తేరుబండిపై అమ్మవారి ఉత్సవమూర్తులకు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ జి.కామేశ్వరమ్మ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య వందలాది మంది భక్తులు చౌడేశ్వరీదేవి నామస్మరణ చేస్తూ తేరుబండిని లాగుతూ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:55 PM