బుగ్గన కోటకు బీటలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:49 AM
వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని హవా నడిపిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోటకు బీటలు వారాయి.

కొంప ముంచిన అధికార అరాచకం
పదేళ్ల తర్వాత డోన్‌లో ఎగిరిన టీడీపీ జెండా
కోట్ల గెలుపుతో ఫలించిన చంద్రబాబు వ్యూహం
డోన్, జూన్ 6: వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని హవా నడిపిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోటకు బీటలు వారాయి. ఐదేళ్ల పాటు సాగించిన అరాచకాలే బుగ్గన కొంప ముంచాయి. పదేళ్ల తర్వాత డోన్ కోటపై టీడీపీ జెండ రెపరెపలాడింది. డోన్ ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపొం దడంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీనే గెలుపొందింది. 2014 ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుగ్గన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ డోన్ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో బుగ్గన అధికారం అండతో చెలరేగిపోయారన్న విమ ర్శలున్నాయి. టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బుగ్గన వేధింపులకు గురి చేస్తూ వచ్చారన్న ఆరోపణలున్నాయి. అదేవిధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు. అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజ లకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్‌ను బుగ్గన పట్టించుకో లేదని టాక్ ఉంది. వీటికి తోడు బేతంచెర్ల సొంత మండలంలోనే బుగ్గన తారా స్థాయిలో అరాచకాలను ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నాయకులతో పాటు మైనింగ్ వ్యాపారులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలున్నాయి. అంతేగాక నియోజకవర్గంలో కొంతమంది బంధుగణానికి పెద్దపీట వేసి ఇష్టారాజ్యంగా దందాలు సాగించారన్న విమర్శ లున్నాయి. దీంతో నియోజక వర్గంలో బుగ్గన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఏర్పడడానికి ఇవన్నీ కారణాలే అయ్యాన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇలా బుగ్గన సాగిం చిన నియంతృత్వ పోకడలతో ఓటమిని చవి చూశారన్న చర్చ సాగుతోంది.
బుగ్గన కోటకు బీటలు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత మండల మైన బేతంచెర్లలోనే వైసీపీ కోటలు బీటలు వారాయి. మొదటి నుంచి బుగ్గనకు బేతంచెర్ల మండలం అండగా నిలుస్తూ వచ్చింది. అయితే బేతం చెర్లలోనే బుగ్గనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందనడానికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బేతంచెర్ల మండలంలోనే అత్యధిక మెజారిటీ లభించింది.
ఫలించిన చంద్రబాబు వ్యూహం: టీడీపీ అధినేత చంద్రబాబు డోన్ నియోజకవర్గంలో అనుసరించిన వ్యూహం ఫలించింది. బుగ్గన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ అసెంబ్లీపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. డోన్ నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఎన్ని కల ముందు టీడీపీ కూటమి డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలో దింపారు. కేఈ వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గాలను సమన్వయం చేస్తూ చంద్రబాబు వ్యూహాలతో పావులు కదిపారు. వీటికి తోడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చరిష్మా కలిసిరావడంతో డోన్‌లో టీడీపీ విజయకేతనం ఎగుర వేసింది. పదేళ్ల తర్వాత డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పదవిని సొం తం చేసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లకు అండగా ఆమె.. డోన్ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపులో ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అండగా నిలిచారు. నియోజకవర్గంలో భర్త గెలుపు కోసం సుజాతమ్మ అలుపెరుగని పోరాటం చేశారు. ఇంటింటికి తిరిగి, ప్రజల్లో మమే కం అవుతూ శ్రమించారు. గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ మహిళగా రొట్టెలు చేస్తూ కోట్ల సుజాతమ్మ మహిళలను ఆకట్టుకున్నారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి, కూతుళ్లు కోట్ల నివేదిత, చిత్రమ్మలు ఎంతో శ్రమించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోట్ల గెలుపు కోసం ఎంతో కష్టపడి పని చేశారు. వాటి ఫలితంగానే డోన్‌లో టీడీపీ జెండా రెపరెపలాడింది.