ప్లాస్టిక్ నిషేధానికి బనగానపల్లె నాంది పలకాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:23 PM
ప్లాస్టిక్ నిషేఽధానికి జిల్లాలో బనగానపల్లె నాంది పలకాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పిలుపునిచ్చారు.

బనగానపల్లె, డిసెంబరు 28, (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ నిషేఽధానికి జిల్లాలో బనగానపల్లె నాంది పలకాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పిలుపునిచ్చారు. టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ ‘నా బనగానపల్లె, నా ఆరోగ్యం’ పేరుతో ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునిచ్చారు. దీంతో శనివారం పట్టణంలో మంత్రి జనార్దన్‌రెడ్డి, ఇందిరమ్మ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, వివిధ అసోసియేషన్ సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బనగానపల్లె మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, కరస్పాండెంట్లు, కిరాణ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్, హోటల్ అసోసియేషన్, గోల్డ్ అసోసియేషన్, వివిధ శాఖల అధికారులు పొదుపు మహిళలు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాముల కూడలి పాత సిండికేట్ బ్యాంకు, సీఐ కార్యాలయం, ఆ స్థానం రోడ్డు, పెట్రోల్‌బంకు కూడలి మీదుగా ఉన్నత పాఠశాల మైదానం వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్టులు పట్టుకొని ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ నిషేధం సాధ్యమని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఇందిరమ్మ మాట్లాడుతూ సంక్రాంతి నాటికి బనగానపల్లెలో ప్లాస్టిక్ వాడకం ఉండకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రమాణం చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై నృత్య ప్రదర్శన చేసిన ఏకే అనిల్ బృందానికి రూ.10 వేలు బహుమతి అందించారు.