Share News

అవగాహన సమావేశాలు నిర్వహించాలి

ABN , Publish Date - May 25 , 2024 | 11:38 PM

కౌంటింగ్‌ నియమాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా మండల స్థాయిల్లో జూన్‌ 1వ తేదీలోపు అవగాహన సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అధికారులను ఆదేశించారు.

అవగాహన సమావేశాలు నిర్వహించాలి

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), మే 25: కౌంటింగ్‌ నియమాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా మండల స్థాయిల్లో జూన్‌ 1వ తేదీలోపు అవగాహన సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం రాయలసీమ యూనివర్సిటీలో జూన్‌ 4వ తేదీ కౌంటింగ్‌ నిర్వహించనున్న సందర్భంగా జిల్లా భద్రతా ప్రణాళిక అమలుపై పోలీసు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 4న రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్‌ నిర్వహించనున్న సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ విధులకు కేటాయించిన సిబ్బంది వివరాలు, ఫొటోలను పోలీసు అధికారులకు ఇవ్వాలని సంబందిత ఆర్వోలను ఆదేశించారు. ఏజెంట్ల వివరాలను మే 31వ తేదీలోపు అందజేయాలన్నారు. మండల హెడ్‌ క్వార్టర్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎస్పీ జి.కృష్ణకాంత్‌ మాట్లాడుతూ మొత్తం 188 సున్నితమైన గ్రామాలను గుర్తించామని అన్నారు. ఆ గ్రామాల్లో కౌంటింగ్‌ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టాటిక్‌ పోలిస్‌ పికెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

31 చెక్‌పోస్టులు ఏర్పాటు: రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్‌ హాలులోకి ఎంట్రీ అయ్యేందుకు కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ పట్టణాలకు సంబంధించిన ముఖ్యమైన జంక్షన్లలో 31 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని సున్నితమైన పాకెట్లలో సీఐ, ఎస్‌ఐ నేతృత్వంలో పెట్రోలింగ్‌ నిర్వహించే విధంగా 57 క్యూఆర్టీలను, 10 నుంచి 12 సమస్యాత్మక గ్రామాలను ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్స్‌ నేతృత్వంలో కవర్‌ చేసే విధంగా 67 రూట్ల మొబైల్‌ టీములను, షాడో పార్టీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఎనిమిది టియర్‌ గ్యాస్‌ టీములు: లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు ఎదురైన తరుణంలో వాటిని పరిష్కరించడానికి 8 టీయర్‌ గ్యాస్‌ టీములు, అన్ని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపామన్నారు. ఎన్నికల పోలింగ్‌ రోజు ఘటనలు సృష్టించిన కేసుల్లో ఉన్న నిందితులందరినీ సీఆర్పీఎఫ్‌ 41 నోటీసులు ఇవ్వడంతో పాటు అరెస్టులు చేశామని చెప్పారు. సున్నిత, సమస్యాత్మక గ్రామాల్లో కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. లూజ్‌ పెట్రోల్‌ ఇవ్వకుండా అన్ని పెట్రోల్‌ బంకులలకు నోటీసులు అందజేశామని చెప్పారు. ఫైర్‌ క్రాకర్స్‌లు కౌంటింగ్‌ రోజున అమ్మకుండా ఉండేందుకు ఫైర్‌ క్రాకర్‌ గోడౌన్స్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగరాజు, నాగబాబు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:38 PM