ఆర్మీ జవాన్ తల్లి స్థలం కబ్జా
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:20 PM
వైసీపీ నాయకుడు లక్ష్మన్న తమ స్థలాన్ని కబ్జా చేశాడని బాధిత మహిళ తహసీల్దార్ ఎదుట బోరున విలపించింది.

తహసీల్దార్ వద్ద బోరున విలపించిన బాధిత మహిళ
ఆదోని రూరల్ , జూలై 8 : వైసీపీ నాయకుడు లక్ష్మన్న తమ స్థలాన్ని కబ్జా చేశాడని బాధిత మహిళ తహసీల్దార్ ఎదుట బోరున విలపించింది. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన దాసరి వెంకటేశులు, లక్ష్మి దంపతులు ఆదోనిలో స్థిరపడ్డారు. వీరి ఒక్కగానొక్క కొడుకు దాసరి శ్రీనివాసులు ఆర్మీ జవాన్. వీరికి 1999లో అప్పటి ప్రభుత్వం రాయనగర్‌లో సర్వే నెం. 158లో రెండున్నర సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఆర్డీటీ సంస్థ ఒకటిన్నర సెంట్ స్థలంలో ఇల్లు కట్టించింది. నాలుగు సంవత్సరాల క్రితం వెంకటేశులు మృతి చెందడంతో లక్ష్మి ప్రస్తుతం ఆలూరులో బంధువుల వద్ద నివాసం ఉంటోంది. మూడు సంవత్సరాల క్రితం రాయనగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు లక్ష్మన్న ఈమె సెంటు స్థలాన్ని కబ్జా చేశాడు. ఆదోనికి చెందిన ఈరన్న, దానం, కప్పగల్ రెడ్డి న్యాయం చేస్తామంటూ ఆమె వద్ద నుంచి రూ.70వేలు వసూలు చేశారు. మోసపోయానని తెలిసిన దాసరి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, జయమనోజ్‌రెడ్డి చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు జయమనోజ్ రెడ్డి వారి నుంచి రూ.60వేలను ఆమెకు తిరిగి ఇప్పించాడు. అయితే వైసీపీ నాయకుడు కబ్జా చేసిన స్థలాన్ని మాత్రం ఇప్పించలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ప్రజా పరిష్కార వేదికలో సోమవారం బాధిత మహిళ తహసీల్దార్ హసినా సుల్తానాను కలిసి వినతిపత్రం అందించి బోరుమంది.