Share News

అడుగంటుతున్న జలాశయాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:49 AM

అడుగంటుతున్న జలాశయాలు

అడుగంటుతున్న జలాశయాలు

ఎండిన కాలువలు, బీడువారిన పొలాలు

దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని దుస్థితి

దశాబ్ద కాలంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎన్నడూ లేని దుర్భిక్షాన్ని ఎదుర్కొంటోందని జలవనరుల శాఖ అధికారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం జలాశయం, తుంగభద్ర జలాశయం డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. ఫలితంగా నిన్న మొన్నటి దాకా కాస్తో.. కూస్తో నీటి ఛాయలతో కనిపించిన ప్రధాన కాలువలు కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ, ఎస్సార్బీసీ, తెలుగు గంగ, గాజులదిన్నె తదితర కాలువలు ఎండిపోయి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 8: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన జలాశయాలతోపాటు చిన్న నీటి వనరుల ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు నీరందిస్తున్నారు. ఈసారి జూన్‌ నుంచి వర్షం జాడ లేకపోవడంతో వరద ప్రవాహం ఆగష్టుకే సన్నగిల్లింది. దీంతో నీటి నిల్వ కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఖరీఫ్‌ సీజన్‌లో కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ, ఎస్సార్బీసీ, తెలుగు గంగ తదితర ప్రధాన కాలువల ద్వారా అతికష్టమ్మీద నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రబీలో ఆరుతడి పంటలకైనా నీరు ఇస్తారేమోనని రైతులు ఎదురు చూసినా తాగునీటి ఎద్దడిని ఎదుర్కోడానికే తీవ్ర ఇబ్బందులు తప్పేట్లు లేవని, ఈ పరిస్థితుల్లో రబీ పంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో రైతులు పంటల సాగును విరమించుకున్నారు. రబీలో దాదాపు ప్రధాన కాలువల కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. ఈసారి ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందించలేకపోవడంతో పొలాలన్ని నెర్రలిచ్చి బీడువారిపోయాయి.

తుంగభద్ర జలాశయంలో 105.788 నీటి నిల్వ సామర్థ్యం ఉండాలి. గత సంవత్సరం ఇదే సమయానికి 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 10.286 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఎగువ నుంచి చుక్కనీటి ప్రవాహం కూడా జలాశయంలోకి రావడం లేదని, ఈ పరిస్థితుల్లో వచ్చే జూన్‌ వరకు తాగునీటి అవసరాలను ఏవిధంగా తీర్చాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంలో తుంగభద్ర జలాశయంలో ఈ పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

ఏపీతోపాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకతోపాటు మద్రాసు రాష్ట్రానికి కూడా నీరందించడానికి ఏకైక మార్గంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 49.83 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత సంవత్సరం 80 టీఎంసీల దాకా ఇదే సమయానికి నిల్వ ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గత సంవత్సరం దాదాపు ఏడు సార్లు పూర్తిగా నిండి దిగువకు వదిలారు. ఈసారి మొదటి నుంచి ఆ పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా కర్నూలు తాగునీటి అవసరాలు తీరుస్తున్న సుంకేసుల జలాశయంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.881 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కర్నూలు తాగునీటి అవసరాల కోసం రోజూ 159 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. గాజులదిన్నె జలాశయంలో 4.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 1.845 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జూన్‌ వరకు ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్‌తో పాటు కర్నూలు తాగునీటి అవసరాలను ఈ కొద్దిపాటి నీటితో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం గాక అధికారులు తలపట్టుకూర్చున్నారు. క్రిష్ణగిరి జలాశయంలో 0.164 టీఎంసీలకుగను 0.68 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జూన్‌ వరకు తాగునీటి అవసరాలను ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు ఏవిధంగా జలాశయాల్లో అంతంత మాత్రంగా ఉన్న నీటి నిల్వ నుంచి సర్దుబాటు ఎలా చేయాలో అర్థం కావడం లేదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉన్నాయి

గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రధాన జలాశయాలతోపాటు మధ్యతరహా, చిన్ననీటి తరహా జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేరలేదు. జూన్‌ వరకు జలాశయాల్లో ఉన్న కొద్ది పాటి నీటితోనే ప్రజల తాగునీటి అవసరాలను సర్దుబాటు చేయాల్సి ఉంది. నీటి వృథాను అరికట్టి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

- రెడ్డి శేఖర్‌ రెడ్డి, ఎస్‌ఈ

Updated Date - Jan 09 , 2024 | 12:49 AM