Share News

జింకల బెడద

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:41 PM

జింకలు ముచ్చటగొలుపుతాయి. చెంగు చెంగున అవి ఎగురుతుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఆనందమే. కానీ ఆదోని డివిజన్‌లోని కొన్ని గ్రామాల రైతులకు మాత్రం జింకలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 జింకల బెడద

కృష్ణ జింకలతో రైతులు బెంబేలు

గుంపులు గుంపులుగా పొలాలపై దాడి

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనం

పంటలను కాపాడాలని రైతుల వేడుకోలు

ఆదోని, జూలై 29: జింకలు ముచ్చటగొలుపుతాయి. చెంగు చెంగున అవి ఎగురుతుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఆనందమే. కానీ ఆదోని డివిజన్‌లోని కొన్ని గ్రామాల రైతులకు మాత్రం జింకలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కసారిగా వందల జింకలు పత్తి, వేరుశనగ, వరి, కంది, ఆముదం వంటి పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. ఒకసారి ఒక మంద పొలాల మీదికి వచ్చిందంటే పంట ధ్వంసమైపోయినట్టే. పంటలను తిని, పీకేసి చేతికి అందకుండా చేస్తున్నాయి. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, చిప్పగిరి, హాలహర్వి, ఎమ్మిగనూరు, పత్తికొండ మండలాలతోపాటు కర్నూలు జిల్లా అంతటా రైతులకు జింకల బెడద తీవ్రమైంది. చాగి, నారాయణపురం, ధానాపురం ముసానహళ్లి కాత్రికి, పెద్దహొతూరు, జోహరాపురం, మొలగవల్లి తదితర గ్రామాల్లోనూ అదే పరిస్థితి.

జంకలకు ఆహారంగా పంటలు

ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు... ఇప్పుడు వేలాదిగా పెరిగిపోయాయి. గ్రామ శివార్లలో గొర్రెల మందలను తలపించేలా తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. మందల్లా వచ్చి పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, వరి, మినుముల పంటలను... మొక్క దశలోనే తినేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసినప్పటి నుంచి కోత కోసే వరకు పొలాల వద్ద రేయింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఈ ఏడాది సాగు చేసి పంటల్లో సగం వరకు జింకలకు ఆహారంగా మారాయని పేర్కొన్నారు.

జింకల పార్కు ఏర్పాటుకు కృషి

2014లో కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జింకల పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఏడాది ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టు ప్రాంతంలో జింకల పార్కు ఏర్పాటుకు 250 ఎకరాల భూమిని సర్వే చేశారు. దీని కోసం గతంలో రూ.53.26 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అటవీశాఖ అధికారులు తుంగభద్ర రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలోని 35, 36, 37 బీట్‌ కంపార్ట్‌మెంట్‌లో 12 అడుగుల ఎత్తులో కంచె వేయాలని నిర్ణయించారు. దీని కోసం రూ.29.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశారు. అలా కాకుండా పార్కు ఏర్పాటు చేస్తే రూ.14.72 కోట్లు అవుతుందని, ఐదేళ్లపాటు జింకల నిర్వహణకు రూ.29.65 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జింకల పార్కుపై దృష్టి సారించలేదు. అప్పటి కార్మికశాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కూడా పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా అచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడైనా జింకల పార్కు ఏర్పాటు చేస్తారా? అని రైతులు వేచి చూస్తున్నారు.

జింకల బారి నుంచి పంటలను కాపాడాలి

నాకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి పంటను సాగు చేశాను. గుంపులు గుంపులుగా కృష్ణ జింకలు వచ్చి పంటలను మొలక దశలోనే తినేస్తున్నాయి. పంటలను తొక్కేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలవుతోంది. విత్తనం వేసినప్పటి నుంచి కాపు వచ్చేంత వరకు రాత్రి, పగలు కాపలా కాస్తున్నాం.

-గొల్ల సోమనాథ్‌, యువ రైతు, మదిరె గ్రామం, ఆదోని మండలం

ప్రతి ఏడాది ఇదే పరిస్థితి

నాకున్న 10 ఎకరాలలో పత్తి పంట సాగు చేశాను. జింకల సంఖ్య అధికం కావడంతో పత్తి పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి. గతంలో జింకలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం గొర్రెల గుంపు కంటే అధికంగా ఉన్నాయి.

-కురువ లింగన్న, రైతు, మదిరె గ్రామం, ఆదోని మండలం

ప్రభుత్వం చొరవ చూపాలి

జింకల పార్కును ఏర్పాటు చేసి పంటలను కాపాడాలి. ఆదోని డివిజన్‌లో అఽధికంగా జింకలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఒక్కసారి పొలంలో పడితే పంట అంతా నాశనమే. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జింకలను పట్టుకుని శ్రీశైలం అడవుల్లో వదిలింది. చంద్రబాబునాయుడు జింకల పార్కును ఏర్పాటు చేసి జింకల నుండి పంటలను రక్షించాలి.

-కురువ పెద్దలింగన్న, ఉప్పరహళ్‌, గ్రామం, కౌతాళం మండలం

Updated Date - Jul 29 , 2024 | 11:41 PM