రవ్వలకొండను మింగిన అనకొండ
ABN , Publish Date - Mar 29 , 2024 | 11:39 PM
ఎమ్మెల్యే రామిరెడ్డి రవ్వలకొండను మింగిన అనకొండ అని, బనగానపల్లెకు పట్టిన శని అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
బనగానపల్లెకు పట్టిన శని రామిరెడ్డి
అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా
నాపరాయి పరిశ్రమను ఆదుకుంటాం
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
బనగానపల్లె, మార్చి 29: ఎమ్మెల్యే రామిరెడ్డి రవ్వలకొండను మింగిన అనకొండ అని, బనగానపల్లెకు పట్టిన శని అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బనగానపల్లె స్థానిక పెట్రోల్ బంకు కూడలిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి అడ్డూ అదుపు లేకుండా అరాచకాలు సాగిస్తున్నారన్నారు. మైనింగ్ యజమానులకు లీజుకు ఇవ్వాలన్నా, రాయల్టీలు ఇవ్వాల న్నా కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. కొంత మంది ఎస్సీ, ఎస్టీలను బినామీలుగా పెట్టుకొని కబ్జాలు సాగిస్తున్నాడని, సిమెంటు ఫ్యాక్టరీల నుంచి కమీషన్లు, ఇక కొంతమంది రౌడీలతో బొలేరో బ్యాచ్‌లతో అరాచకాలు సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. నాటుసారా అమ్మకాల్లో కూడా ఆయన హస్తం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బనగానపల్లెను అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఇక్కడ నిరుపేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. నాపరాయి పరిశ్రమను ఆదుకుంటామని, బనగానపల్లెకు రింగు రోడ్డు, కోయిలకుంట్లకు బైపాస్ రోడ్డు, బనగానపల్లెలో ఇంజనీరింగ్ కళాశాల, బనగానపల్లె, కోయిలకుంట్లలో పెండింగ్‌లో ఉన్న షాదిఖానాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే బనగానపల్లెలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని, బనగానపల్లె, కొలిమిగుండ్లలో సిమెంటు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే వారికే భూములు ఇస్తామని, పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన జగన్..
రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని, రాయలసీయను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు కృషి చేశామని చెప్పారు. నందికొట్కూరులో మెగా సీడ్ పార్కుతోపాటు, జైన్ ఇరిగేషన్‌ను కూడా తీసుకువచ్చామని, అలాగే ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కును తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. కానీ జగన్ వచ్చాక వాటన్నింటిని పక్కకు పెట్టడంతో ఇక్కడ యువతకు ఉపాధి లభించకుండా పోయిందన్నారు. ఓర్వకల్లులో వెయ్యి మెగావాట్ల విద్యుత్ పరిశ్రమను తీసుకువస్తే అది తన ఘనతగా జగన్ చెప్పుకుంటున్నాడని, అలాగే ఓర్వకల్లు విమనాశ్రయాన్ని రూ.90 కోట్లతో తాను పూర్తి చేసి ప్రారంభించానని, జగన్ అధికారంలోకి వచ్చాక తాను పూర్తి చేసినట్లు తన పార్టీ రంగులు వేసుకుని, తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారని దుయ్యబట్టారు. నదుల అనుసంధానంతో గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువచ్చి రాయలసీమను మరో కోనసీమగా మార్చాలని ప్రయత్నించానని, అందులో భాగంగా రూ.12 వేల కోట్లను రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశానని చెప్పారు.
సొంత కొడుకు పేరిట భూములు..
ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడటానికి ముందు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డిని ఖాదీ గ్రామోద్యోగ సమితి సభ్యులు కస్టోడియన్‌గా ఎన్నుకోగా, ఆ సమితికి చెందిన భూములను కబ్జా చేసేందుకు పన్నాగం పన్నారని, అందులో భాగంగా తన కొడుకు పేరిట సంవత్సరానికి రూ.12 వేల చొప్పున 99 సంవత్సరాలకు లీజు రాయించుకున్నాడని, అలాగే పలు భూములను బినామీ పేర్లతో హస్తగతం చేసుకున్నాడని ఆరోపించారు. కొలిమిగుండ్లకు చెందిన బీసీ నాయకుడైన సుబ్బారావును దారుణంగా హత్య చేయించాడని అన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీకి చెందిన వందల మంది నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడన్నారు. బనగానపల్లె పట్టణంలో దొంగ పట్టాలు ఇచ్చి పేదలను వంచించాడని, అలాగే ప్రస్తుతం ఇంటి పట్టాలంటూ పేదల నుంచి కోట్లు వసూలు చేశాడన్నారు. రవ్వలకొండలో మైనింగ్ చేసి దోచుకున్నాడని, బనగానపల్లె పట్టణంలో వెంచర్ యజమానులు నుంచి భారీ ఎత్తున కమీషన్లు దండుకుంటున్నాడన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ను పూర్తి చేసి 13 టీఎంసీల నీటిని నిల్వ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అలాగే ఇక్కడి నుంచి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వరకు నీటిని తీసుకువెళ్లే అవుకు టన్నెల్ నిర్మాణం కూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందని తెలిపారు.
చంద్రన్న రాజ్యం కావాలా.. రౌడీ రాజ్యం కావాలా?
ఇదే సభలో నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో రౌడీ రాజ్యం సాగిందన్నారు. రైతులు సాగునీరు అడిగితే, వారికి నోటీసులు ఇచ్చి వేధింపులకు గురిచేశారన్నారు. చంద్రబాబు అధికారంలోనికి వస్తేనే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాటసాని రామిరెడ్డి కబ్జాదారుడని, అలాంటి వారిని తరిమి కొడదామన్నారు. వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి కల్తీ విత్తనాలతో రైతులను దగా చేస్తున్నారని, అలాంటి ఎంపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోగిశెట్టి నరసింహారావుటీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌గౌడ్, బనగానపల్లె నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, ఎమ్మార్సీఎస్ నాయకులు వేలాదిగా పాల్గొన్నారు.