Share News

అమిత్‌ షా రాజీనామా చేయాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:34 PM

అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా వెంటనే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు.

అమిత్‌ షా రాజీనామా చేయాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ

కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా నేడు నగరంలో ర్యాలీ

కర్నూలు అర్బన్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా వెంటనే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నగర అధ్యక్షుడు షేక్‌ జిలానీ బాషాతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన అమిత్‌షాకు హోంమంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారమే మూడు పర్యాయాలు హోమంత్రిగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సమ్మాన్‌ మార్చ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అమిత్‌ షాను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని, ఆ పత్రాన్ని రాష్ట్రపతికి పంపాలని కోరతామని చెప్పారు. షేక్‌ జిలానీ బాషా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావి అంబేడ్కర్‌కు అవమానం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, అనంతరత్నం మాదిగ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:34 PM