Share News

అల్లు అర్జున్‌ పర్యటన ఎఫెక్ట్‌

ABN , Publish Date - May 25 , 2024 | 11:31 PM

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్‌ రెడ్డికి మద్దతుగా హీరో అల్లు అర్జున్‌ పర్యటన ప్రభావం పోలీసులపై పడింది.

అల్లు అర్జున్‌ పర్యటన ఎఫెక్ట్‌

ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

ఎస్పీ, డీఎస్పీ , టూటౌన్‌ సీఐకు ఈసీ నోటీసులు

60 రోజుల్లో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

నంద్యాల (నూనెపల్లె), మే 25: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్‌ రెడ్డికి మద్దతుగా హీరో అల్లు అర్జున్‌ పర్యటన ప్రభావం పోలీసులపై పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదులతో భారత ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే సినీ హీరో అల్లు అర్జున్‌, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్‌రెడ్డిలు ఇద్దరు మంచి మిత్రులు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా రవి చంద్రకిషోర్‌రెడ్డి నంద్యాల అసెంబ్లీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. అల్లు అర్జున్‌ ఈ నెల 11వ తేదీన శిల్పా రవి చంద్ర కిషోర్‌ రెడ్డి ఇంటికి రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నంద్యాల పట్టణ శివారు నుంచి అల్లు అర్జున్‌కు వేలాదిమంది అభిమానులు బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటిపై నుంచి అల్లు అర్జున్‌ ప్రజలు, అభిమానులకు అభివాదం చేశారు. అంతేకాకుండా శిల్పా రవి చేయి పట్టుకుని అల్లు అర్జున్‌ అభివాదం చేశారు. ఆయన పర్యటన, జనసమీకరణకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతి లేకపోవడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లయింది. ఎన్నికల కోడ్‌తో పాటు పోలీస్‌ యాక్ట్‌ 30, 144 సెక్షన్లు అమలులో ఉండటంతో అల్లు అర్జున్‌, శిల్పా రవిలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతంపై సంబంధిత కానిస్టేబుళ్లు పోలీస్‌ ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎస్‌బీ కానిస్టేబుల్‌ నాగరాజు, టూటౌన్‌ ఎస్బీ హెడ్‌ కానిస్టేబుల్‌ స్వామి నాయక్‌లపై వేటు వేస్తూ వీఆర్‌కు పంపించారు. ఇదే అంశంపై నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌ రెడ్డి, టూటౌన్‌ సీఐ రాజారెడ్డికి ఈసీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురు అధికారులపై 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఆ అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని పోలీస్‌ శాఖలోని వర్గాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది.

Updated Date - May 25 , 2024 | 11:31 PM