ప్రజా వినతులను సరిగా పరిష్కరించండి: కలెక్టర్
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:27 AM
ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

నంద్యాల కల్చరల్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్వీకరించిన 18 దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. అందులో మూడు దరఖాస్తులు రీ ఓపన్ అయ్యాయని, వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీసేవా సర్వీసులను కూడా క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ముందు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కార్యకలాపాలకు సంబంధించిన దస్త్రాలన్నీ ఈ-ఆఫీస్ ద్వారా సిగ్నేచర్ లేకుండా వస్తున్నాయని, ఈ-ఫైలింగ్ విధానంపై పూర్తిస్ధాయి అవగాహన పొంది ప్రతి ఫైలు ఈ - ఆఫీసు ద్వారానే రావాలన్నారు. కార్యక్రమంలో 199 మంది అర్జీదారులు కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌తో పాటు జేసీ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.