Share News

చర్యలు శూన్యం

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:26 PM

జిల్లా వైసీపీ కార్యాలయం పేరిట చేపట్టిన ప్యాలెస్‌ నిర్మాణం అది.

చర్యలు శూన్యం

అనుమతులు లేకుండా కార్యాలయ భవన నిర్మాణం

నోటీసులతో సరిపుచ్చిన కర్నూలు కార్పొరేషన్‌ అధికారులు

వైసీపీతో అంటకాగుతున్న ఓ అధికారి

కర్నూలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైసీపీ కార్యాలయం పేరిట చేపట్టిన ప్యాలెస్‌ నిర్మాణం అది. ఎలాంటి అనుమతులు లేవని కుడా, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నిగ్గు తేల్చారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పి.. ఇప్పటికీ ఆ పార్టీతో అంటకాగుతున్న కార్పొరేషన్‌కు చెందిన కీలకమైన అధికారి ఒకరు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే వైసీపీ జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ ఇంటికి ఓ వ్యక్తిని పంపించి.. 15 రోజులు గడువు కోరుతూ కేఎంసీ నోటీసుకు సమాధానం ఇవ్వమని ఆ అధికారి సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు సమాధానం ఇచ్చారే తప్ప ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదని తెలుస్తున్నది. రైతుల అవసరాలు తీర్చడానికి ఇచ్చిన స్థలాన్ని వైసీపీ ఆఫీసుకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. దీన్ని తిరిగి ఏపీ ఆగ్రోస్‌కే ఇవ్వాలని ఆ సంస్థ ఉద్యోగుల సంఘం నాయకులు ఏపీ ఆగ్రోస్‌ ఎండీకి లేఖ రాశారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

కర్నూలు నగరం రైల్వే స్టేషన్‌ (ఆర్‌ఎస్‌) రోడ్డు ఐదు రోడ్ల కూడలిలో ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఆగ్రోస్‌ సంస్థ)కు సర్వే నంబరు 95-2బీలో 1.60 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.100 కోట్లు పైమాటే. గత జగన్‌ ప్రభుత్వంలో ఈ భూమిపై వైసీపీ నాయకులు కన్నేశారు. మొత్తం 1.60 ఎకరాలు వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం 33 ఏళ్లు లీజుకు ఇస్తూ.. 2023 ఆగస్టు 15న గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే.. ఆనాడు వైసీపీ నాయకుల అధికారం బలం, ప్రశ్నిస్తే సీఐడీ కేసులు పెట్టి వేధిస్తారనే భయంతో ఏ ఒక్కరూ ప్రశ్నించలేని పరిస్థితి. ఈ అక్రమాన్ని ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. అయినా.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఏడాదికి రూ.1,600 లీజుకు కారుచౌకగా వైసీపీకి కట్టబెట్టడం ప్రజల్లో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఏపీ ఆగ్రోస్‌కే ఇవ్వండి

కర్నూలు నగరంలో రూ.కోట్లు విలువైన ఏపీ ఆగ్రోస్‌ భూమిని గత వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ఆ పార్టీ కార్యాలయం కోసం 33 ఏళ్లు లీజుకు ఇచ్చింది. వైసీపీ నాయకుడైన ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చారు. లీజును రద్దు చేసి తిరిగి ఏపీ ఆగ్రోస్‌ సంస్థకు కేటాయించాలని కోరుతూ ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు బీవీ వెంకటరెడ్డి ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఇక్కడ వ్యవసాయ అవసరాలైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ వంటి వాటి కోసం వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా రాజకీయ పార్టీ ఆఫీసుకు లీజుకు ఇవ్వడం సరైనది కాదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

నాడు కళ్లకు గంతలు కట్టుకున్నారా..?

వైసీపీ కార్యాలయానికి 33 ఏళ్లు లీజుకు ఇస్తూ గత జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే.. ప్రజాస్వామ్యవాదులు ఎరైనా న్యాయస్థానానికి వెళ్తారేమో..? అనే భయంతోనే జీవోను తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జీవో ఇవ్వగానే ఆనాటి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఓ కాంట్రాక్ట్‌ సంస్థ ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు మొదలు పెట్టారు. అక్రమంగా భారీ భవంతి నిర్మిస్తోంటే కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (కుడా) అనుమతులు తీసుకోవాలనే కనీస విజ్ఞత లేకుండా అధికారం మాటున అక్రమ నిర్మాణం చేపట్టారు. ‘అధికార పార్టీనా మజాకా..! శీర్షికన ఆంధ్రజ్యోతి వైసీపీ ఆఫీసు అక్రమ నిర్మాణాన్ని 2023 ఆగస్టు 7న వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంలో ఉలిక్కిపడ్డ వైసీపీ నాయకులు అదే నెల 31న రూ.10 వేలు అప్లికేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసి వదిలేశారు. ఆ తరువాత పర్మిట్‌ ఫీజ్‌, గ్రీన్‌ ఫీజ్‌ ఆన్‌లైన్‌లో చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఆనాడు మాదే అధికారం.. మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు..? అనే ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఫైవ్‌ రోడ్స్‌ జంక్షన్‌ మీదుగా కలెక్టరు, కుడా వైస్‌ చైర్మన్‌, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌ (డీసీపీ) వంటి ఉన్నత అధికారులు నిత్యం రాకపోకలు సాగించినా.. అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం మాత్రం వారికి కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ కనిపించినా మాకెందుకు అంటూ కళ్లకు గంతలు కట్టుకున్నారా..? వారికే తెలియాలి. ఈ నెల 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో వైసీపీ ముఖ్య నాయకుల్లో అలజడి మొదలైంది. గత నెల 18న లెబర్‌ సెస్‌ కాంపోనెంట్‌-1, లేబర్‌ సెస్‌ కాంపొనెంట్‌-2 ఫీజులు చెల్లించి కీలకమైన డాక్యుమెంట్లు లేకుండా కుడాకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. కర్నూలులో వైసీపీ ప్యాలెస్‌..! శీర్షికన అక్రమ నిర్మాణాలపై మరోసారి ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?

వైసీపీ కార్యాలయ నిర్మాణాలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన కుడా అధికారులు అక్రమ నిర్మాణమే అని నిగ్గు తేల్చారు. అక్రమ నిర్మాణాలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుడా వైస్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సూర్యనారాయణరెడ్డి కర్నూలు కార్పొరేషన్‌ కమిషనర్‌ భార్గవ్‌తేజకు జూన్‌ 22న లేఖ రాశారు. దీని ఆధారంగా నోటీసు అందిన ఏడు రోజుల్లోగా డాక్యుమెంట్లతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోతే ఏపీఎంసీ చట్టంలోని సెక్షన్‌ 452(1), 461(1) మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడికి గత నెల 24న నోటీసులు ఇచ్చారు. అయితే.. నోటీసులు జారీ చేసి ఏడు రోజులు దాటిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల సేవలో తరించి.. ఇప్పటికీ ఆ పార్టీకే అంటకాగుతున్న కార్పొరేషన్‌కు చెందిన కీలకమైన అధికారి ఒకరు వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా.. నోటీసు పంపిన రెండు మూడు రోజలకు తనకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తిని వైసీపీ ముఖ్య నాయకుల వద్దకు పంపించి కార్పొరేషన్‌ ఇచ్చిన నోటీసుకు 15 రోజులు గడువు కోరుతూ సమాధానం ఇవ్వమని ఆ అధికారి ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ అధికారి సూచన మేరకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు వెకేట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (వీఎల్‌టీ), కర్నూలు అర్బన్‌ తహశీల్దారు సంతకంతో భూమి స్వాధీనం చేసిన పత్రాలు, కర్నూలు అర్బన్‌ తహశీల్దారు జారీ చేసిన సర్వే నంబరు 95/2బీ ఎఫ్‌ఎంబీ రికార్డు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి జారీ చేసిన ఈసీ.. వంటి డాక్యుమెంట్‌ సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సామాన్య ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే అనుమతి లేదంటూ వాలిపోయే పట్టణ ప్రణాళిక అధికారులు ఏడాదిగా ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

15 రోజుల గడువు కోరుతూ రిప్లై ఇచ్చారు

ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన వైసీపీ కార్యాలయం రెండు అంతస్తుల నిర్మాణం చివరి దశకు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోరాదో కోరుతూ ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కర్నూలు కార్పొరేషన్‌ కమిషన్‌ గత నెల 24న నోటీసు జారీ చేశారు. 15 రోజులు గడువు ఇస్తే నోటీసులో సూచించిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేస్తామని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రిప్లై సమాధానం ఇచ్చారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

- ప్రతాప్‌ సూర్యనారాయణరెడ్డి, కుడా వైస్‌ చైర్మన్‌, కర్నూలు

Updated Date - Jul 08 , 2024 | 11:26 PM