వివాహ వేడుకలో విషాదం
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:20 AM
కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం గ్రామంలో వివాహ వేడుకలో బుధవారం విషాదం చోటు చేసుకుంది.

బాలుడి తలపై ఎక్కిన డీజే వాహనం
అక్కడికక్కడే దుర్మరణం
సజ్జలగుడ్డం గ్రామంలో ఉద్రిక్తత
కోసిగి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం గ్రామంలో వివాహ వేడుకలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పూర్తయి మెరవణి కోసం ఏర్పాటు చేసిన డీజే వాహనం కింద పడి మనోజ్(7)అనే బాలుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు... సజ్జల గుడ్డం గ్రామానికి చెందిన ఆర్లబండ నాగేష్ కుమారుడు బసవరాజు వివాహం బుధవారం ఉదయం జరగడంతో రాత్రి 8 గంటలకు మెర వణి నిర్వహించారు. కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన వివాహ గుర్రాల బండి, డీజే వాహనాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో వాహనాలు అదుపుతప్పి వెనుక వైపు నుంచి బాలుడు కురువ మనోజ్‌పైకి వెళ్లాయి. దీంతో బాలుడి తలభాగం దెబ్బ తిని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన బాలుడి కుటుంబ సభ్యులు పెళ్లి వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో డ్రైవర్లు, వాహన యజమానులు అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమా చారం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాలుడి మృతికి కారణమైన పెళ్లి వాహనాలను కోసిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులు గోరంట్ల చంద్ర, శారదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు. కాగా బాలుడు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.