శ్రావణ మాసోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:19 PM
శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 3 వరకు శ్రావణ మాసోత్సవాలను నిర్వహించనున్నారు.

శ్రీశైలం, జూలై 8: శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 3 వరకు శ్రావణ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సంద ర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు శ్రావణ మాసోత్సవాల ఏర్పాట్లపై పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో ఉభయ దేవాలయాల ప్రధానా ర్చకులు, అధ్యాపక, సీనియర్ వేద పండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ శ్రావణ మాసంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ, బహుళ ఏకాదశి, శ్రావణ మాస శివరాత్రి, సెలవు రోజుల్లో అత్యధికంగా భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతమైన దర్శనం, వసతి, తదితర సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రావణ మాసంలో ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిలుపుదల చేసి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు. మిగిలిన రోజుల్లో నిర్ధిష్ట వేళలలో రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే భక్తుల రద్దీ కారణంగా శ్రావణ శని, ఆది, సోమవారాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మీవ్రతం, పౌర్ణమి మొదలైన రోజుల్లో మొత్తం 16 రోజులు స్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసంలో రెండు పర్యాయాలు ఉచిత సామూహిక వరలక్ష్మీ వత్రాలను జరిపించనున్నారు. అదేవిధంగా లోకకల్యాణం కోసం శ్రావణమాసమంతా ఏడు భజన బృందాలతో అఖండ చతుస్సప్తాహా శివభజనలు నిర్వహించనున్నారు.