Share News

పదో తరగతి విద్యార్థినికి అరుదైన శస్త్ర చికిత్స

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:47 AM

నెలన్నర రోజుల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

పదో తరగతి విద్యార్థినికి అరుదైన శస్త్ర చికిత్స

కోత లేకుండా వీడియో ద్వారా ఆపరేషన్‌

కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 1: నెలన్నర రోజుల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో బాలిక గుండె వెనుక భాగంలో పెద్ద కణితి ఉంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియోథోరాసిక్‌ సర్జన్‌ డా.సి.ప్రభాకర్‌ రెడ్డి కోత లేకుండానే త్వరగా కోలుకునే విధంగా ఆపరేషన్‌ చేశారు. కొత్త పద్ధతిలో వీడియోలో చూస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా బుధవారం నిర్వహిం చారు. బాలిక కోలుకుని నడవసాగింది. డోన్‌ మండలం దొరపల్లికి చెందిన పద్మ అనే బాలిక కడుపు నొప్పితో స్థానిక వైద్యులను సంప్రదించింది. అక్కడ ఎక్స్‌రే పరీక్ష తీయగా.. ఛాతిలో కణితి ఉన్నట్లు గుర్తించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ నెల 18న బాలికను తల్లిదండ్రులు కర్నూలు జీజీహెచ్‌ లోని కార్డియోథోరాసిక్‌ సర్జరీ విభాగానికి తీసుకు వచ్చారు. అక్కడ ఆ విభాగం హెచ్‌వోడీ డా.సి.ప్రభాకర్‌ రెడ్డి ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ ఇతర పరీక్షలు నిర్వహించగా.. గుండె వెనుక బాగంలో న్యూరో ఫ్రైభోమా అను బడే కణితి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా బాలికకు ఓపెన్‌ ఆపరేషన్‌ చేస్తే ఒకటిన్నర నెలల్లో పరీక్షలు రాయడం కష్టమవుతుందని డా.ప్రభాకర్‌ రెడ్డి భావించారు. వీఏటీఎస్‌ వీడియో అసిస్టెంట్‌ తోరాసిక్‌ సర్జరీ వంటి అధునాతన పద్ధతిలో ఆపరేషన్‌ నిర్వహించారు. వీడియో చూస్తూ ఐదు మిల్లీ లీటర్ల 3 చిన్నగాట్లు పెట్టి ఛాతిలోకి టెలిస్కోప్‌ను పంపించారు. వీడి యోలో చూస్తూ ఆపరేషన్‌ చేశారు. దీంతో బాలిక తొందరగా కోలుకుంది. పెద్ద గాయం ఉండదు కాబట్టి రోగికి ఎలాంటి ఇబ్బంది ఉండదని డా.ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. రోగి త్వరగా రికవరీ అవుతుందని, మార్చిలో జరిగే పరీక్షలకు తొందరగా ప్రిపేర్‌ కావడానికి వీలు ఉంటుందని తెలిపారు. కార్పొరేట్‌లో రూ.లక్షల్లో ఉండే ఈ సర్జరీని ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామని, యూరాలజి హెచ్‌వోడీ డా.సీతారామయ్య సహకారం అందించగా.. మత్తు మందును డా.కొండారెడ్డి ఇచ్చారని వెల్లడించారు.

Updated Date - Feb 02 , 2024 | 12:47 AM